'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం

64th Sahitya Conference As 'Tana World Sahityavedika' - Sakshi

డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు.

సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు.

తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు.

ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.”

సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్‌ను క్లిక్‌ చేసి వినవచ్చు.

https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX

whatsapp channel

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top