17వ ఆటా మహాసభలు: వారధిగా ‘ఆటా’

17th ATA Conference Ata a bridge to Two Telugu States and NRIs - Sakshi

 తెలుగు రాష్ట్రాలకు, ప్రవసాంధ్రులకు వారధిగా ఆటా వేదిక

అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌లో చర్చా వేదికలు

తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది రాజకీయ ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలను ప్రతిబింబించే ప్రత్యేక స్టాళ్లు

మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు

వాషింగ్టన్‌ డీసీ: వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ నిర్వహించబోతున్న వేడుకలు రెండు రాష్ట్రాలకు, ప్రవాసాంధ్రులకు మధ్య వారధిగా నిలవబోతు న్నాయి. ఈ వేడుకలకు రెండు రాష్ట్రాల నుంచి 60 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఆటా వేదికగా పొలిటికల్‌ డిబేట్లు జరగనున్నాయి. వీటితో పాటు వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులైన వారితో డీసీ కన్వెన్షన్‌లోని వేర్వేరు వేదికలపై చర్చా కార్యక్రమాలు విడివిడిగా నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు ప్రత్యేక చిరునామా
పుట్టి పెరిగిన మాతృభూమిపై మమకారం చూపించేలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీకి అయిదు స్టాళ్లు, తెలంగాణకు అయిదు స్టాళ్లు ఇందులో ఉంటాయి. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ కీలక అంశాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రవాసాంధ్రులకు వివరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్‌ అవేర్‌నెస్‌ డెస్క్‌, అలాగే మెడికల్‌, టూరిజం, రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలందిస్తారు.

ఈ స్టాళ్లలో ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాల్లో ప్రవాసులు తమ వంతుగా భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ‘నాడు-నేడు’, ‘మన బడి’ లాంటి కార్యక్రమాలకు విరాళాలను అందించడంలో ముందుంటున్నారు. ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం మరింత పెంచేలా అధికారులు ఈ స్టాళ్లలో వివరాలందించ నున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు హరి లింగాల, రత్నాకర్‌ పండుగాయల తదితరులు వీటికి తోడ్పాటు అందిస్తున్నారు. ముఖ్య విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఈ స్టాళ్లలో అందుబాటులో ఉండి ప్రవాసాంధ్రుల విజ్ఞప్తులను పరిశీలిస్తారు. మొత్తమ్మీద ప్రభుత్వానికి, అలాగే ప్రవాసాంధ్రులకు ఆటా కన్వెన్షన్‌ వారధిగా నిలవనుంది.

జోహార్‌ వైఎస్సార్‌
ఆటా వేడుకల్లో భాగంగా డీసీ కన్వెన్షన్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ఆర్‌ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం అమెరికాలోని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. మరి కొంత మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చే రెండు రోజుల్లో అమెరికా రానున్నారు.

- వాషింగ్టన్‌ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top