నిజామాబాద్ రూరల్ : జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అనేక మంది ప్రజలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, రేకుల షెడ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని, అలాంటి నిరుపేదలను నోటీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం మానవత్వానికి విరుద్ధమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్‌ఎస్‌పీ) జిల్లా కార్యదర్శి కటారి రాములు పేర్కొన్నారు. సోమవారం నాందేవ్‌వాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...రిజర్వ్ ఫారెస్ట్ భూమి అయినా, రెవెన్యూ భూమి అయినా ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న అర్హులైన పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖలతో సమన్వయం చేసి భూపట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, భారీ ఎత్తున ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ప్రజా భూములను ఆక్రమించిన భూబకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడిన వారిని వదిలేసి, కేవలం పేద ప్రజలపైనే చర్యలకు దిగడం వివక్షాపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూబకాసురులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకొని, ఆ భూములను అర్హులైన పేదలకు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ గృహాలు నిర్మించి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదల హక్కుల పరిరక్షణ కోసం ఆర్‌ఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నాయకులు పిట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.


