పథకం ప్రకారమే చోరీ | - | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే చోరీ

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

కామారెడ్డి క్రైం: బాన్సువాడ పట్టణంలో నాలుగు రోజుల క్రితం వెలుగు చూసిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే చోరీకి పాల్పడిన ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గౌలీగూడకు చెందిన చింతల భాస్కర్‌ గత నెల 27న మధ్యా హ్నం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి కిరాణా దుకాణానికి వెళ్లాడు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పై అంతస్తులో ఉన్న లాకర్‌ తెరిచి బంగారం, వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం నిజాంసాగర్‌ మండలం బొగ్గుగుడిసె ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. నిందితులను చోరీ జరిగిన ఇంటి పక్కనే నివాసం ఉండే దండుగుల మైసయ్య, దండుగుల ఎల్లయ్యలుగా గుర్తించారు.

నిందితులిద్దరూ దగ్గరి బంధువులు

నిందితులిద్దరూ దగ్గరి బంధువులు. ప్రధాన నిందితుడైన మైసయ్యపై గతంలో ఆరు దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు వెళ్లి ఇటీవలే వచ్చాడు. జైలులో ఉన్నప్పుడు అతని బెయిల్‌ కోసం కుటుంబసభ్యులు అప్పులు చేశారు. చేసిన అప్పులు తీర్చడానికి మళ్లీ దొంగతనం చేయాలని ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తూ నిర్ణయించుకున్నారు. భాస్కర్‌ దంపతులు ఇంటికి తాళం వేసి వెళ్లడాన్ని గమనించి చోరీకి పాల్పడ్డారు. చోరీ సొత్తును హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళ్తుండగా నిఘావేసి పట్టుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి 31.2 తులాల బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలు, రూ.9,700 నగదు, నేరానికి ఉపయోగించిన బైక్‌, సెల్‌ఫోన్‌ లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐ శ్రీధర్‌, సీసీఎస్‌ సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్సై శిరీష, సిబ్బందిని అభినందించారు. ఏఎస్పీ నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడలో భారీ చోరీ కేసును

ఛేదించిన పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్టు,

రూ.56 లక్షల విలువైన సొత్తు రికవరీ

వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌ చంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement