నిజామాబాద్ రూరల్: పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు సంజీవ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఐజే యూ పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. దేశ స్థాయిలో సమగ్ర మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అరవింద్ బాలాజీ, ప్రసాద్, నర్సయ్య, గంగాదాస్, దేవీదాస్, గోవిందరాజ్, సాయిరాం, మురళి, గంగామోహన్, మురళి, గంగులు తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కన్వీనర్ రజినీకాంత్, జిల్లా కో కన్వీనర్ మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ వద్ద టీయూడబ్ల్యూజే హెచ్–143 రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ పిలుపుమేరకు సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయానికి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఉత్తరాలు, నిరసన చేపట్టారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలన్నారు. నాయకులు బాలు, ఆనంద్ పాల్, ఆంజనేయులు, కర్క రమేశ్, విజయ్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
రెంజల్: మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పనుల కోసం వెళ్లిన బాలుడు మృతి చెందడంతో రూ. 50 వేలకు ప్రాణం ఖరీదుగా సంబంధిత ట్రాక్టర్ యజమాని నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని వద్ద అదే గ్రామానికి చెందిన బాలాజీ(15) అనే బాలుడు పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పనిచేసే ప్రాంతం సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరు తీసుకు రావాలని యజమాని చెప్పాడు. దీంతో కాలువలోకి దిగిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని యజమానిని కోరగా రూ. 50 వేలు అందిస్తామని చెప్పాడు. ఈ విషయమై ఎస్సై గంగాధర్‌ను వివరణ కోరగా మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బోధన్: ఆటోలో ఉంచిన రూ. 5 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మోహన్ శుక్రవారం తన ఆటోలో నగదును ఉంచగా గుర్తు తెలియని వ్యకి అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


