నిజామాబాద్ అర్బన్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రత్యేక అధికారులకు టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఐడీవోసీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్చార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా వైద్యాధికారి రాజశ్రీ హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పోషకాహార పారితోషికంము (డీబీటీ) ను జనవరి నుంచి జూన్ వరకు మంజూరైన నిధులను వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 47 శాతం మాత్రమే పూర్తి చేసినందున మిగతాది త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు. అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారుల సహకారాలతో స్వచ్ఛంద సేవా సంస్థలను మోటివేట్ చేస్తూ క్షయ వ్యాధిగ్రస్తులకు ఫుడ్ బాస్కెట్లు ఇచ్చేలా చూడాలన్నారు. జిల్లా వైద్యాధికారి రాజశ్రీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 975 క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఒక క్షయ వ్యాధిగ్రస్తుడికి పోషకాహార కిట్టును ఇచ్చేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ సాయన్న, జడ్పీ సీఈవో సాయా గౌడ్, డీఐవో అశోక్, జిల్లా ఉప వైద్యాధికారి సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, సుప్రియ, వెంకటేశ్, నవ్య, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


