మరో యూరియా యాప్‌! | - | Sakshi
Sakshi News home page

మరో యూరియా యాప్‌!

Aug 3 2026 3:51 AM | Updated on Aug 3 2026 3:51 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు మరో కొత్త యాప్‌ రైతుల ముందుకు రానుంది. ఎరువుల పంపిణీని డిజిటలైజ్‌ చేసే క్రమంలో ఈ నెల 6వ తేదీ నుంచి సరికొత్త యాప్‌ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కస రత్తు చేస్తోంది. ఇప్పటి వరకు యూరియా బుకింగ్‌ కోసం వినియోగించిన ‘ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌’ స్థానంలో... ఇకపై ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో యాప్‌ అమల్లోకి రానుంది. మరో కొత్త విధానం వస్తుండడంపై క్షేత్ర స్థాయిలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త యాప్‌లో రైతులకు మరిన్ని సేవలు లభించనున్నాయి. గతంలో ఉన్న యాప్‌లో కేవలం యూరియాను మాత్రమే బుక్‌ చేసేకునే వీలుండగా, కొత్త యాప్‌లో డీఏపీ, పొటాష్‌తోపాటు వివిధ రకాల కాంప్లెక్స్‌ ఎరువులను కూడా బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కల్పిస్తోంది. దీని ద్వారానే రైతులు అన్ని రకాల ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే పాత యాప్‌ సేవలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.

ఈ రెండూ ఉంటేనే ఎరువులు

‘ఫ్రేమ్‌వర్క్‌ ఫెర్ట్టిలైజర్‌ సేల్‌’

పేరుతో రూపకల్పన

ఈ నెల 6నుంచే అమలుకు

కేంద్ర వ్యవసాయశాఖ కసరత్తు

రైతు గుర్తింపు నంబర్‌ లేదా ఆధార్‌లింక్‌ మొబైల్‌ నంబర్‌ ఉంటేనే బుకింగ్‌

యూరియాతోపాటు డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులకూ ఇదే విధానం

కొత్త యాప్‌పై శిక్షణ ఇస్తాం

పాత యాప్‌ స్థానంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను ఆగస్టు 6వ తేదీ నుంచి అమ లులోకి తెస్తోంది. ఇందులో యూరియాతోపాటు ఇతర ఎరువులు కూడా బుకింగ్‌ చేసుకోవచ్చు. యాప్‌ గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ లేదా ఆధార్‌ లింకై ఉన్న మొబైల్‌ నంబర్‌ ఉంటే సులభంగా బుకింగ్‌ చేసుకోవచ్చు. కొత్త యాప్‌ విధానంపై ఇదివరకే వ్యవసాయాధికారులకు అవగాహన కల్పించారు. త్వరలోనే డీలర్లకు, రైతులకు కూడా అవగాహన కల్పిస్తాం.

– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

అమల్లోకి వచ్చే యాప్‌ ద్వారా ఎరువులు పొందాలంటనే ప్రతి రైతుకూ ‘ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌’ తప్పనిసరిగా ఉండాలి. ఈ నంబర్‌ ఆధారంగానే యాప్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేకపోతే, రైతు ఆధార్‌ కార్డుతో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఎరువులు బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉండదు. అయితే, పాత యాప్‌ ద్వారా ఎకరానికి గరిష్టంగా రెండు బస్తాలే ఇవ్వగా, కొత్త యాప్‌లో ఎన్ని బస్తాలు ఇస్తారో అధికారిక సమాచారం లేకపోవడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. అలాగే పంటల సాగు సమయంలో కొత్త యాప్‌తో ఎరువులు సరిపడా అందుతాయో లేదోనని భయపడుతున్నారు. కాగా, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని సామాన్య రైతులకు యాప్‌లతో ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement