నిజామాబాద్ అర్బన్ : ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు మహిళ కాళ్లు, చేతులు కట్టేసి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని హస్మీ కాలనీలో ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. మెడికల్ షాపులో పనిచేసే మహ్మద్ మస్రత్ రోజూలాగే ఆదివారం సైతం పనికి వెళ్లగా.. ఇంట్లో అతడి భార్య ఉంది. ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు మస్రత్ భార్య కాళ్లు, చేతులను కట్టేసి ఇంట్లోని లోపలి రూములో తోసేశారు. అనంతరం ఇంట్లోని 8 తులాల బంగారం, 9 తులాల వెండి, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారు. దుండగులు వెళ్లిపోయిన తరువాత అతికష్టం మీద బయటికి వచ్చిన బాధితురాలు చుట్టుపక్కల వారికి విషయం తెలిపింది. సమాచారం అందుకున్న ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.


