● ట్రస్మా జిల్లా సమావేశంలో
ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్‌లు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు వ్యక్తులు ప్రైవేట్ స్కూళ్లపై దౌర్జన్యాలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిని అదుపు చేయాలని ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని విద్యా పబ్లిక్ స్కూల్ ఆవరణలో తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల కరస్పాండెంట్లు తాము క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పడాల కిశోర్ మాట్లాడుతూ.. పలు విద్యార్థి సంఘాల వేధింపుల అంశాన్ని ఇప్పటికే అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్ల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మారుతున్న కాలంతోపాటు బోధనా విధానంలో మార్పు వచ్చిందని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు.
అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఈగ శ్యాంసుందర్‌రెడ్డి, గౌరవ అతిథి ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్, ట్రస్మా జిల్లా క్యాదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్ రాజు గుజరాతి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీశైలం, డివిజన్ అధ్యక్షులు రఘురాజ్, రాజు, చక్రపాణి, ప్రభాదేవి, ముజీబ్, విక్టరీ స్కూల్ కరస్పాండెంట్ సుజా సురేశ్, అనిత, జిల్లాలోని వివిధ ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.


