డొంకేశ్వర్(ఆర్మూర్) : వన్యప్రాణుల వారోత్సవా లు వచ్చాయంటే చాలు అటు అటవీ శాఖ అధికారులకు, ఇటు పర్యావరణ ప్రేమికులకు ఎక్కడ లేని ఉ త్సాహం వస్తుంది. రంగురంగుల ఫ్లెక్సీలు, వేదికల మీద ఉదాత్తమైన ఉపన్యాసాలు, ఫొటోలకు ఫోజులు.. ఇలా ‘జాతీయ వన్యప్రాణుల వారోత్సవాల’ పేరుతో హడావుడి మొదలవుతుంది. కానీ క్షేత్రస్థా యిలో మాత్రం మూగజీవాల వేట జిల్లాలో యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అటవీ అధికారుల వైఖరి ని ఎండగడుతూ అటవీ ప్రాంతంలో ఓ మర్రిచెట్టు కింద కూర్చున్న లేడి, కోతి సంభాషణ అటవీ రక్షణ తీరుకు అద్దం పడుతోంది. వాటి సంభాషణ సాగిందిలా..
కోతి (చెట్టు పైనుంచి కింది దిగుతూ): ఏందే లేడమ్మా? అలా బిక్కమొ హం వేసుకుని కూర్చున్నావ్? అటవీ అధికారు లు, ప్రజలు కలిసి మనకోసం వారం రోజులపాటు పెద్ద పండగ చేస్తున్నారట కదా! ర్యాలీలు తీసి టీవీలు, పేపర్లలో మన బొమ్మలు వేస్తున్నారట!
లేడి (నిట్టూరుస్తూ): ఏం పండగలే బావా.. అంతా కంటితుడుపు చర్య! ఇదంతా చూస్తుంటే నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. ఒకవైపు మనల్ని కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు వేదికలెక్కి మైకులు పగులగొడుతుంటే... ఇంకోవైపు అడవిలో వేటగాళ్లు వైర్లు, ఉచ్చులు పరుస్తూ మన ప్రాణాలు తీస్తున్నారు. మొన్నటికి మొన్న మన పక్కనే కమ్మర్‌పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో రెండు చిరుతలు ఇలాగే బలైపోయిన ఘటన గుర్తులేదా?
కోతి (తల గోక్కుంటూ): అవును కదా! చిరుతలు చనిపోయిన విషయం పక్కన పెడితే, ఆ మధ్య మహారాష్ట్ర నుంచి వచ్చిన మన ‘జే–1’ పెద్దపులి పెద్దన్న ఏమయ్యాడో తెలుసా? నాలుగైదు నెలలుగా అసలు ఆయన కనిపించడం లేదు. అధికారులు మాత్రం పులి జాడ కోసం డ్రోన్లు తిప్పాం, కెమెరాలు పెట్టాం అంటూ కథలు చెబుతున్నారు.
లేడి (కళ్లలో నీళ్లతో): ఆ పెద్దన్నను కూడా వేటగాళ్లు లేపేశారనే అనుమానాలు గట్టిగా ఉన్నాయి బావా. అంత పెద్దపులి బాస్‌కే రక్షణ లేకపోతే.. రేపు నన్నో, నిన్నో వేటగాళ్లు తుపాకీతో కాల్చడమో, ఉచ్చులో వేయడమో ఖాయం. అడవుల్లోకి వేటగాళ్లు చొరబడి మన ప్రాణాలను హరిస్తున్నా, అటవీ అధికారులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని, వారోత్సవాల నిర్వహణతో చేతులు దులుపుకుంటున్నారు.
కోతి: నిజమే లేడమ్మా! ఢిల్లీ నుంచి ఏకంగా ఎన్‌టీ సీఏ పెద్ద సార్లు వచ్చి పెద్ద పులి మిస్సింగ్ కేసు విషయంలో లోకల్ అధికారులకు క్లాస్ పీకారని తెలిసింది. పులి అదృశ్యం కావడానికి ఫారెస్ట్ శాఖలోనే ఒకరిద్దరు ఉద్యోగులు వేటగాళ్లకు సహకరించినట్లు గు సగుసలాడుతుండగా చెట్టు చాటున ఉండి విన్నా! పెద్దపులి పెద్దన్న మిస్సింగ్ కేసును తేల్చకుండానే ఇప్పుడు ఈ వన్యప్రాణుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం చూస్తుంటే నవ్వస్తోంది.
లేడీ: ఇప్పటికై నా ఈ ప్రచార ఆర్భాటాలు ఆపి, నిజాయితీగా మనల్ని కాపాడే చర్యలు చేపట్టకపోతే, మున్ముందు వీళ్లు వారోత్సవాలు చేసుకోవడానికి అడవిలో ఒక్క జంతువు కూడా మిగలదు బావా!
(సంభాషణ ముగిస్తూ ఆ రెండు జీవాలు అడవిలోని దట్టమైన పొదల్లోకి తలదాచుకోవడానికి వెళ్లిపోయాయి)


