పెర్కిట్(ఆర్మూర్): కురిసిన ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టడానికి జలసిరి పథకంలో చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణాన్ని సమర్ధవంగా పూర్తి చేయాలని ఆర్మూర్ మండల ప్రత్యేక అధికారి, డీసీవో శ్రీనివాస్ రావు అధికారులకు సూచించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జలసిరి పథకంపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీవో మాట్లాడుతూ.. వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీచార్జీ గుంతల నిర్మాణాన్ని నిర్ధేశించిన గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఆలూర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రత్యేక అధికారిణి, ఏడీఏ విజయలక్ష్మీ, ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీవోలు శ్రీనివాస్, రఘురాం, కార్యదర్శులు, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: భూగర్భ జలాల పెంపు కోసమే ‘జలసిరి’ కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రతిఒక్కరూ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ జెడ్పీ సీఈవో, డిచ్‌పల్లి మండల ప్రత్యేక అధికారి సాయాగౌడ్ అన్నారు. డిచ్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన ‘జలసిరి’ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంట, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని సూచించారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా వెంటనే పనులు చేపట్టాలని 15 రోజుల్లో ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈలోపు భారీ వర్షాలు పడితే నీటిని పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎంపీడీవో ఉదయ్ భాస్కర్, తహసీల్దార్ సతీష్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఏపీవో మంజుల, ఏఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు.


