సుభాష్‌నగర్ : నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏఆర్‌టీ సెంటర్‌లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్‌టీ) పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 18 నుంచి 21 వరకు జీజీహెచ్‌లోని ఏఆర్‌టీ సెంటర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను పొందాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అందించాలని సూపరింటెండెంట్ తెలిపారు.
మాక్లూర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూర్ సొసైటీ పాలకవర్గ సభ్యులు శనివారం కలిశారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోళ్లను ముమ్మరంగా చేపట్టి తుది దశకు తీసుకొచ్చామని మంత్రికి వివరించారు. దీంతో పాలకవర్గాన్ని మంత్రి తుమ్మల అభినందించారు. వచ్చే వర్షాకాలం సీజన్‌లోనూ రైతులకు ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని సూచించా రు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మల్ గోపి, మాక్లూర్ సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్, మాజీ చైర్మన్, ప్రస్తుత డైరెక్టర్ దయాకర్‌రావు, వైస్‌చైర్మన్ గుండారం శేఖర్,డీకంపల్లి సర్పంచ్ మచ్చర్ల చిన్న య్య,డైరెక్టర్లు కాశీనాథ్‌రావు, మచ్చర్ల రమేశ్, ప్రసాద్‌రావు, అశోక్ తదితరులు ఉన్నారు.
సుభాష్‌నగర్: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతమైనట్లు జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. సింకోపల్ అటాక్స్‌తో బాధపడుతున్న యాదయ్యకు శనివారం జీజీహెచ్‌లో యాంజియోగ్రామ్ నిర్వహించారు. కార్డియాలజీ, వైద్య బృందం సమష్టి కృషితో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆధునిక గుండె వైద్యసేవల బలోపేతానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రి నిరంతరం కృషి చేస్తుందని నాగమోహన్ రావు పేర్కొన్నారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 169 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏడుగురు నిందితులకు కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.10,80,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ అర్బన్ : ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ శివారులో శనివారం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్సు సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి, రూ.1,25,344 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఆరో టౌన్ పోలీసులకు అప్పగించారు.


