కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలపై ఆసక్తి, నాయకత్వ లక్షణాల పెంపు కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. 18న ఫిట్ అండ్ యాక్టివ్ పేరిట రాజారాం స్టేడియంలో మారథాన్, 19న కెరీర్ నైపుణ్యాభివృద్ధిపై శివాజీనగర్‌లోని ఏటీసీలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 20న ఏటీసీలో నాయకత్వ లక్షణాలపై అవగాహన, 21న జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ డే, 22న స్వచ్ఛ తెలంగాణ, 23న జాబ్‌మేళాలో ఉద్యోగం సాధించిన వారికి నియామక పత్రాలు, క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.
బీఎల్‌ఏల నియామకానికి తక్షణ చర్యలు
బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ) నియామకానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బీఎల్‌ఏల జాబితాను నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అందించాలని రాజకీయ పార్టీలను మరోమారు లిఖిత పూర్వకంగా కోరాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలు తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీఈవో దృష్టికి తెచ్చారు. అర్బన్ నియోజకవర్గంలో సైతం మ్యాపింగ్ ప్రక్రియలో ఆశించిన పురోగతి వచ్చిందన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జూన్ 15వ తేదీ లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్వో గీత, నిజామాబాద్, బాన్సువాడ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రవీందర్, డీఆర్డీవో సాయన్న, సీపీవో రతన్ తదితరులు పాల్గొన్నారు.


