● యుద్ధ పరిస్థితులు కొలిక్కి రాకపోవడంతో ఇబ్బందులు
● గల్ఫ్ దేశాలకు ప్రయాణంపై తీవ్ర ప్రభావం
● రెండు, మూడింతలుగా చార్జీల వడ్డన
మోర్తాడ్: పశ్చిమాసియాలో శాంతి చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రభావం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికులపై తీవ్రంగా పడుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బహ్రెయిన్, కువైట్‌కు మినహా ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు రెండుమూడింతలు పెరిగాయి. విమానయాన సంస్థలు ఊహించని విధంగా చార్జీలను పెంచడంతో వలస కార్మికులు ఆర్థిక భారాన్ని అధికంగా మోయాల్సి వస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా దేశాలకు చార్జీలు సాధారణం కన్నా ఎక్కువగా పెరిగాయి. బహ్రెయిన్, కువైట్ దేశాలకు ఇంకా విమాన సర్వీసులు పునః ప్రారంభం కాలేదు. విమానయాన సంస్థలపై నియంత్రణ లేకపోవడంతోనే చార్జీలను రెండు, మూడింతలుగా పెంచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల్లో ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులే ఉంటారు. విదేశాంగ శాఖతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు స్పందించి వలస కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేలా చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆయా దేశాలకు విమాన చార్జీలు
దేశం సాధారణ రోజుల్లో.. ప్రస్తుతం
యూఏఈ రూ.11వేల నుంచి రూ.13వేలు రూ.28వేల నుంచి రూ.33వేలు
ఒమన్ రూ.6వేల నుంచి రూ.12వేలు రూ.20వేల నుంచి రూ.30వేలు
ఖతర్ రూ.12వేల నుంచి రూ.20వేలు రూ.40వేల నుంచి రూ.50వేలు
సౌదీ రూ.12వేల నుంచి రూ.15వేలు రూ.20వేల నుంచి రూ.25వేలు


