చెరువులో ఆటో డ్రైవర్ గల్లంతు
డిచ్‌పల్లి: హనుమంతునికి పూజ చేద్దామని వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన ఘటన దూస్‌గాంలో చోటు చేసుకుంది. స్థానికులు, డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్‌కు చెందిన నందాల జగన్నాథం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం దూస్‌గాం గ్రామానికి చెందిన వ్యక్తి జగన్నాథం ఆటోను కిరాయికి మాట్లాడుకుని అందులో మేకలను తరలించారు. ఉదయం 10.30 గంటలకు మేకలను గ్రామంలో దింపేసి ఆటో తీసుకుని తిరిగి నిజామాబాద్‌కు వస్తున్నాడు. దూస్‌గాం గ్రామ చెరువు కట్టపై హనుమాన్ ఆలయం వద్దకు రాగానే ఆటోను నిలిపివేశాడు. స్నానం చేసి హనుమంతుడిని దర్శించుకుందామని చెప్పి మొదట కొన్ని పూలు తెంపి ఆటోలో ఉంచాడు. అనంతరం స్నానానికి చెరువులోకి దిగాడు. చెరువులో మొరం కోసం తవ్విన గుంతల్లో పడి తిరిగి పైకి రాలేదు.
ఆటో వద్ద వేచి ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని స్థానికులకు తెలుపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక జాలర్లతో రాత్రి వరకు చెరువులో గాలింపు చేపట్టినా మృతదేహం ఆచూకీ లభించలేదు. కుటుంబసభ్యులు చెరువు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్నాథంకు భార్య శైలజ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


