ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన కేంద్ర బృందం
సిరికొండ: మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలను కేంద్ర బృందం సభ్యులు శనివారం తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకం అమలు తీరును పరిశీలించారు. డీఈవో అశోక్‌తో కలిసి కేంద్ర టెలికమ్యూనికేషన్ జాయింట్ సెక్రెటరీ దేవేంద్ర కుమార్‌రాయ్, ఎస్‌ఐఈటీ డైరెక్టర్ విజయలక్ష్మి, స్టేట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనాథ్, ఎఫ్‌ఏవో నాగజ్యోతి తదితరులు తనిఖీలో పాల్గొన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, సైన్స్ ప్రయోగశాలను వారు పరిశీలించారు. పీఎంశ్రీ పథకం ద్వారా అందుతున్న నిధుల వినియోగం, డిజిటల్ లెర్నింగ్ అమలు తదితర పథకాలపై సమీక్షించారు. వివిధ అంశాలపై విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం, విద్యా సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్ అవకాశాలపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


