రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా..
● రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేసిన రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టరా?
● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెడతారా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆయన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేల్పూర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నోటీసులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో 53 వేల మందికి రుణమాఫీ జరగాల్సి ఉండగా 22 వేల మందికే వచ్చిందని, ఇంకా 30 వేల మందికి రుణమాఫీ జరగలేదన్నారు. రైతుభరోసా సాయం ఐదుసార్లు ఇవ్వాల్సి ఉండగా.. మూడుసార్లు ఎగ్గొట్టారని విమర్శించారు. ఒకసారి సగం మాత్రమే ఇచ్చారన్నారు. రుణమాఫీ, రైతుబంధుపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. షాపుల్లో లభించే యూరియాను యాప్‌లోకి ఎక్కించి యూరి యా దక్కకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై వంద కేసు లు పెట్టినా రైతులకు రావాల్సిన రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యం బోనస్ కోసం కచ్చితంగా పోరాడుతామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతి తీసుకొని ధర్నా చేస్తే తనతోపాటు కార్యకర్తలు, రైతులు 32 మందిపై కేసులు నమోదు చేయడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. 2024 డిసెంబర్ 18న రాజ్‌భవన్ ఎదుట రోడ్డుపై ధర్నా చేసిన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని, చట్టం రేవంత్‌రెడ్డి చుట్టమా అని డీజీపీ శివధర్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజాసామ్య పద్ధతిలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.


