పెద్దపులి సంచారం ..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సిరికొండ: మండలానికి సమీపంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న రుద్రంగి, మోత్కురావుపేట సరిహద్దు అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని సిరికొండ అటవీ రేంజ్ అధికారి కె నర్సింగరావు ఆదివారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజా మాబాద్ జిల్లాల ఉమ్మడి సరిహద్దులో పులి సంచారం ఉన్నందున, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలు జిల్లా పరిధిలో కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. పొలాల వద్ద విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయొద్దని రైతులకు సూచించారు. అటవీ జంతువుల సంరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పెద్దపులి ఎక్కడైనా ఆవులు, దూడలు, ఇతర జంతువులను చంపితే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.


