గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు
వలస కార్మికుల ప్రయోజనం కోసమే..
మోర్తాడ్: విదేశాల్లో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలుత నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సలహా మండలి సభ్యులు త్వరలో ఇందూరులో పర్యటించనున్నారు. బోర్డు ఆధ్వర్యంలో వలస కార్మికుల జీవన స్థితిగతులు, వారి కుటుంబాలకు ప్రయోజనాలు చేకూర్చేలా సమగ్ర విధానం(గల్ఫ్ ఎన్నారై పాలసీ)ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే.
ఇందులో భాగంగానే బోర్డు ఏర్పాటు జరుగగా సాంకేతిక కారణాలతో అధ్యాయనం ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రభుత్వ యంత్రాంగం అడ్వయిజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించి గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పనకు అధ్యాయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించింది. ప్రభుత్వానికి మరో 14 నెలల్లో నివేదిక అందించాల్సి ఉండగా విడతల వారీగా వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పర్యటించనున్నారు.
పొరుగు రాష్ట్రాల్లోనూ పర్యటించి అక్కడి వలస కార్మికుల కోసం అమలులో ఉన్న పథకాల వివరాలను నమోదు చేయనున్నారు. గల్ఫ్ దేశాల్లోనూ పర్యటించి సమగ్ర విధానంపై పూర్తి స్థాయి నివేదికను అందించనున్నారు.
ఎన్నో ఏళ్లుగా వలస కార్మికుల హక్కులు, ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏదైనా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనే డిమాండ్ ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత ఈ ప్రభుత్వమే గల్ఫ్ వలస కార్మికుల గురించి ఆలోచన చేసింది. వలస కార్మికులకు పూర్తి స్థాయిలో ప్రయోజనాలను అందించడానికి నివేదికను అందిస్తాం. – మంద భీంరెడ్డి,
ఎన్నారై అడ్వయిజరీ బోర్డు వైస్ చైర్మన్
అడ్వయిజరీ బోర్డుకు రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి డాక్టర్ వినోద్‌కుమార్ చైర్మన్‌గా, గల్ఫ్ వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ బోర్డులో మన జిల్లా నుంచి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, యూఏఈలో ఉద్యోగం చేస్తున్న జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌వాసి సత్యం నారాగౌడ్ సభ్యులుగా ఉన్నారు. జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉండటంతో కమిటీలో మనకు ఎంతో ప్రాధాన్యత లభించింది.
జిల్లాలో పర్యటించనున్న
గల్ఫ్ అడ్వయిజరీ బోర్డు సభ్యులు
14 నెలల్లో వలస కార్మికుల
నివేదికను ప్రభుత్వానికి
అందించనున్న అధ్యయన కమిటీ
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు


