
సేఫ్టీ లేకుండానే పనులు..
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 44 విస్తరణ పనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే పనులు చేపడుతున్నారు. దీంతో పని చేసే కూలీలు ప్రమాదాల బారిన పడుతున్నారు. వారం రోజుల క్రితం పనుల్లో భాగంగా ఎలాంటి సేఫ్టీ లేకుండా పైపులైన్ పనులు చేస్తుండగా మట్టి పెల్లాలు కూలి ఇద్దరు కూలీలు మట్టిలో కూరుకుపోయారు. అందులో ఒకరు మత్యువాత పడ్డారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోతోంది. ఆదివారం కూడా పనులు సేప్టీ లేకుండానే చేపడుతున్నారు. రోడ్డు పక్కనే కందకంలో పనులు చేపడుతుంటే రోడ్డుపై నుంచి భారీ వాహనాలు వెళ్తుంటే భూమి కదులుతోంది. ఫలితంగా మట్టి కందకంలో కూలుతుంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి పనులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.