
భరోసా లేని గీతన్నల బతుకు
డిచ్‌పల్లి: పొట్టకూటి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవించే గీత కార్మికుల జీవితాలు ప్రమాదకరం. వారి గీత మార్చేందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా లిక్కర్, శీతల పానీయాలు, విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా రావడంతో గీత కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయి. ఫలితంగా వృత్తిలో సరైన ఉపాధి దొరకక బతుకుతెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాలకు, గల్ఫ్ దేశాలకు వలస బాటపడుతున్నారు. మరో పక్క వృత్తిలో ప్రమాదాలు జరిగి పెద్ద సంఖ్యలో వికలాంగులు అవుతుండగా మరికొందరు చనిపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు తూ..తూ మంత్రపు చర్యలు చేపడుతున్నాయి. నేడు గీత కార్మికుల ఆరాధ్య దైవం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 వేల మంది గీత కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా వారి దరికి చేరడం లేదు. దీంతో వారు వేదనాభరిత జీవితాలను అనుభవిస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు ఆసరా పింఛన్ ఇస్తున్నారు. గీత కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా ఇస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార ఫలితంగా ఎక్కడికక్కడ ఈత, తాటి చెట్లు నరికేస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదు. ఫలితంగా గీత కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. జీవో నంబర్ 560 ప్రకారం ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంటే 5 ఎకరాలు ఈత వనాలకు ఇవ్వాలని మార్గదర్శకత్వాలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది. క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా నివారించవచ్చని, కిడ్నీలో రాళ్లను తొలగిస్తుందని అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. దీనిని ప్రభుత్వమే ప్రచారం చేయడం వల్ల కల్లుకు మార్కెట్ పెరుగుతుంది. తద్వారా గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం ఉండడం లేదు. అలాగే ఎతైన తాటి చెట్టుని ఎక్కాలంటే మోకు, ముస్తాదు పైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ మంది గీత పనులకు దూరమవుతున్నారు. కల్లుగీత కార్పొరేషన్ నుంచి వృత్తిదారులకు సరైన రుణాలు కూడా లభించడం లేదు.
వృత్తిలో అడుగడుగునా జీవన్మరణమే..
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేయాలంటున్న గీత కార్మికులు
నేడు గీత కార్మికుల ఆరాధ్య దైవం
సర్దార్ పాపన్నగౌడ్ జయంతి