గంగనీళ్ల జాతరపై డీఎస్పీ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

గంగనీళ్ల జాతరపై డీఎస్పీ సమీక్ష

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

దిలావర్‌పూర్‌: అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ల జాతర శని, ఆదివారాల్లో అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈ నేపథ్యంలో సాంగ్వి గ్రామంలో గురువారం పోలీసులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆభరణాలు దిలావర్‌పూర్‌ మండలానికి చేరిన తర్వాత సాంగ్వి గ్రామానికి చేరుకునే మార్గంలోని ప్రతీ గ్రామాన్ని డీఎస్పీ పి.శ్రీనివాస్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సాంగ్వి గ్రామంలో గ్రామ పెద్దలు, జాతర నిర్వహణ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనాదిగా భక్తిపూర్వకంగా జరుగుతున్న అమ్మవారి జాతరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామస్తుల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలను కూడా స్వీకరించారు. సాయంత్రం సాంగ్వికి చేరుకున్న అమ్మవారి ఆభరణాలను ఆలయంలో పూజల అనంతరం గోదావరి నదీ తీరానికి తీసుకువెళ్తారు. తెల్లవారుజామున పోలీసు బలగాలు ప్రత్యేక బృందాలతో వెంటనే తీసుకువెళ్లడం వల్ల గ్రామస్తులకు దర్శనం కాకుండా పోతోందని, తమ కోసం కొంత సమయం కేటాయించాలని గ్రామ పెద్దలు కోరారు. సుదూర ప్రాంతాల నుంచి బంధువులు, చుట్టాలు సాంగ్వికి చేరుకుంటారని, వారిని తెల్లవారుజామున అమ్మవారి దర్శనానికి సిద్ధం చేయాలని డీఎస్పీ సూచించారు. సాంగ్వి నుంచి అడెల్లి మహా పోచమ్మ ఆలయం వరకు అనేక గ్రామాల్లో స్వాగతాలు, మొక్కులు ఉంటాయని వివరించారు. ఈసారి సాంగ్వి గ్రామస్తుల కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయిస్తామని, గ్రామస్తులు కూడా సహకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం అడెల్లి దేవస్థానం వారు గ్రామానికి చేరుకుని జాతర ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అందించగా, వాటిని ఆవిష్కరించారు. గతేడాది కంటే దాదాపు అర కిలోమీటరు దూరంలో నదీ నీరు వెనక్కి వెళ్లిపోవడంతో, అక్కడి పచ్చిక బయళ్లలో విద్యుదీపాలు ఏర్పాటు చేయడంతోపాటు, గుంతల చుట్టూ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ఇందులో సర్పంచ్‌ కుచ్చర్ల ధర్మవ్వ భూమేశ్‌, ఉప సర్పంచ్‌ సందీప్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌, వీడీసీ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కోండ్రు లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగా సత్యపాల్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement