నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థి విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థ బలోపే తం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరైతేనే ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలకు రాని విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం చేయాలని ఆదేశించారు. గడువులోగా సిలబస్ పూర్తి చేసి, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని తెలిపారు.
‘అభ్యాస దీపిక’ వెబ్సైట్ రూపకర్తకు అభినందనలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘అభ్యాస దీపిక’ అనే వెబ్సైట్ను రూపొందించిన ప్రధానోపాధ్యాయుడు మునీందర్ రాజును కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రత్యేకంగా అభినందించారు. గణితం, ఇతర సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలు, మెలకువలు, అభ్యాస విధానాలను సాంకేతికత ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల విద్యాభివద్ధికి దోహదపడే ఇలాంటి వినూత్న, సాంకేతిక ఆలోచనలను మరికొందరు ఉపాధ్యాయులు కూడా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సమీక్షలో డీఈవో భోజన్న, ఎంఈవోలు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


