నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మధుమేహం, రక్తపోటు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) వారీగా నిర్వహించిన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) సర్వే ఈ వాస్తవాన్ని స్పష్టం చేసింది. బీపీ, డయాబెటిస్‌పై క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి.
సర్వేలో వెల్లడైన గణాంకాలు
జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారి జనాభా 3,93,944 ఉండగా, వీరిలో 2,58,399 మందిని పరీక్షించారు. అందులో 34,163 మందికి అధిక రక్తపోటు, 21,208 మందికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సారంగాపూర్ మండలంలోనే 2,053 మందికి అధిక రక్తపోటు, 1,418 మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనూ బీపీ, షుగర్ బాధితులు భారీ సంఖ్యలో ఉన్నారని సర్వే వెల్లడించింది.
నిశ్శబ్దంగా మధుమేహం..
మధుమేహం పైకి పెద్దగా లక్షణాలు కనిపించకుండా లోపల శరీరం, కీలక అవయవాలను చెదలా తొలుస్తోంది. వైద్యుల ప్రకారం ఇది కేవలం ఒక వ్యాధి కాదు. అనేక ప్రాణాంతక వ్యాధులకు మూలకారణం. శరీరంలోని ప్రతి కణానికి గ్లూకోజ్ అవసరం. తీసుకున్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి రక్తం ద్వారా కణాలకు సరఫరా అవుతుంది. ఈ గ్లూకోజ్‌ను కణాలు గ్రహించడానికి ఇన్సులిన్ హార్మోన్ అవసరం. ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి కాకపోయినా, ఉత్పత్తైనదాన్ని సమర్థంగా వినియోగించకపోయినా గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతుంది. దీన్నే మధుమేహం అంటారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.
పోటెత్తుతున్న రక్తం..
రక్తపోటు కూడా స్వయంగా వ్యాధి కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిని సూచించే జీవలక్షణం. అయితే అవధిని మించి పెరిగినా తగ్గినా అది రోగలక్షణమవుతుంది. అధిక రక్తపోటుకు చికిత్స చేయకపోతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. మెదడు నుంచి శరీరానికి వెళ్లే రక్తనాళాలు దెబ్బతిని పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
మారిన జీవనశైలే కారణం..
చిన్న వయసులోనే బీపీ, షుగర్ రావడానికి జీవనశైలిలో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మొబైల్, కంప్యూటర్ ముందు గడపడం, వ్యాయామానికి సమయం కేటాయించకపోవడం, ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. పుట్టినప్పటి నుంచి 25 ఏళ్లలోపు వారికి వచ్చే షుగర్‌ను టైప్–1 డయాబెటిస్ అంటారు. అలాంటి వారికి ఇన్సులిన్ అవసరం పడుతుంది. బీపీ, షుగర్ కారణంగా కిడ్నీ సమస్యలు, క్రియాటిన్ పెరగడం, నరాల సమస్యలు, కంటి చూపు కోల్పోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో బీపీ షుగర్ మందులు వాడుతున్న వారు..
పీహెచ్‌సీ బీపీ షుగర్
బాసర 1961 971
పెంబి 1986 896
దస్తురాబాద్ 1350 968
దిలావర్‌పూర్ 1,575 515
కడెం 1,886 985
కుభీర్ 1,790 1,325
కుంటాల 1,978 592
లక్ష్మణచాంద 1,323 1,095
లోకేశ్వరం 1,425 1,060
మహాగాం 1,535 1,041
మామడ 1,950 1,141
ముజిగి 1,045 1,151
నర్సాపూర్(జి) 1,534 1,021
సారంగాపూర్ 2,053 1,418
సోన్ 1,010 795
తానూర్ 1,988 1,160
వెల్మల్‌బొప్పారం 1,040 935
బంగల్‌పేట్ 1,783 1,295
భైంసా 1,145 275
రాంనగర్ 1,945 1,542
30 ఏళ్లలోపు జిల్లా టార్గెట్ 3,93,944
ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు2,58,399
బీపీ వ్యాధిగ్రస్తులు 34,163
షుగర్ వ్యాధిగ్రస్తులు 21,208
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
షుగర్, బీపీ బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సమతుల్య పోషకాహారం తీసుకోవాలి. నూనెతో చేసిన పదార్థాలు, జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను వీలైనంత దూరం పెట్టాలి. మద్యం, ధూమపానం మానుకోవాలి. నిత్యం యోగా, ధ్యానం చేయాలి. నడక, వ్యాయామానికి రోజు కనీసం గంట సమయం కేటాయించాలి. వయసు, ఎత్తుకు తగిన బరువు ఉంచుకోవాలి. కాలానుగుణంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
వ్యాయామం చేయాలి
ప్రస్తుత జీవన విధానంలో ప్రతిఒక్కరూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం తప్పనిసరి. ఆరు నెలలకోసారి కచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ పుడ్, వేపుళ్లకు దూరంగా ఉంటే చాలా మంచిది.
– డాక్టర్ రత్నాకర్ రెడ్డి, ఫిజీషియన్


