నిర్మల్‌చైన్‌గేట్:కాంగ్రెస్ మూకలు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే స్పందించని పోలీసులు, బాధితులను పరమార్శించడానికి వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దౌర్జన్యం చేసినా పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, వాటిని ఖండించిన నాయకుల ఇళ్లపై పడి దౌర్జన్యానికి దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ అల్లరి మూకలను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అరాచకాలకు బీజేపీ భయపడదు
నిర్మల్‌చైన్‌గేట్: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 326 సీట్లతో ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారని ఇండియా టుడే–సీ ఓటర్ సర్వే వెల్లడించిందని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్‌నాథ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో 9 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. అందుకే బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందన్నారు. నల్గొండలో బీజేపీ కార్యాలయం, నాయకుల ఇళ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలను భయపెట్టడం సాధ్యం కాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. 22ఏ భూముల అక్రమాలు, భూ కబ్జాలు, అటవీ భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జమాల్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, కౌన్సిలర్ గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, జింక సురేందర్, హరీష్ పాల్గొన్నారు.


