నిర్మల్‌చైన్‌గేట్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక (టీజీఈజేఏసీ) జిల్లా అధ్యక్షుడు వెల్మల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసి జీవో 25ను సవరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, పి.గంగారెడ్డి, పి.అశోక్, కూడాల రవికుమార్, డి.రమేశ్, కృష్ణారావు, లక్ష్మణ్, జనార్దన్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.


