ఈ ఫొటోలో ఉన్న ఆయిల్ పామ్ పరిశ్రమ సిద్ధిపేట జిల్లా నంగనూర్ మండలం నర్మెటలోనిది. రూ.300 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీలో రిఫైనరీ కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రాసెసింగ్‌తోపాటు నూనెనూ ఉత్పత్తి చేస్తారు. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమకు 62 ఎకరాలు కేటాయించారు. రోజుకు ఇక్కడ 600 టన్నుల గెలలను క్రషింగ్ చేయొచ్చు. ఇందులో నుంచి వచ్చే వ్యర్థాలతోనే పరిశ్రమకు అవసరమైన విద్యుత్‌నూ అందించే నాలుగు మెగావాట్ల ప్లాంట్‌నూ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమ నిర్మల్‌లో నిర్మించాల్సి ఉంది. కానీ శంకుస్థాపన దశ దాటలేదు.
నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు పెద్దపీట వేస్తోంది. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తోంది. మొక్కల పంపిణీ నుంచి డ్రిప్ సబ్సిడీ వరకు పలు రకాల ప్రోత్సాహకాలనూ అందిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఇంకా తాత్సరం చేస్తూనే ఉంది. మూడేళ్ల క్రితం భూమిపూజ చేసిన స్థలంపై రాజకీయ వివాదం కొనసాగుతూనే ఉంది. పంట చేతికి రావడం, లాభాలూ కనిపిస్తుండటంతో ఇక ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఎప్పుడు పెడతారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పరిశ్రమ కోసమే పంట..
ఆయిల్‌పామ్.. ఇప్పుడు మంత్రుల నుంచి అధికారుల దాకా అందరూ ఈ పంటను సాగు చేయాలని, మున్ముందు ఈ పంటకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలోనూ మూడేళ్లలో సాగు పెరుగుతూనే ఉంది. ఇందులో చాలామంది జిల్లాలోనే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో సాగుకు ముందుకు వచ్చారు. సోన్ మండలం పాక్‌పట్ల శివారులో కేటాయించిన 40 ఎకరాల్లో ప్రియూనిక్ కంపెనీ ఈ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వం హయాంలోనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ.. అప్పుడున్న నిబంధనలు మారడంతో ఆ పరిశ్రమ శంకుస్థాపన దగ్గరే ఆగిపోయింది. ఈ పరిశ్రమను ఇప్పుడు రాజకీయాలూ చుట్టుకున్నాయి. మీరంటే మీరు.. అడ్డుపడుతున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆందోళనలూ చేశాయి. కానీ.. పరిశ్రమను మాత్రం ప్రారంభించేందుకు ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. ఇటీవల జరిగిన దిశ మీటింగ్‌లో ఆయిల్‌పామ్ సాగు విషయం వచ్చినప్పుడు జిల్లా అధికారుల ముందు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించాల్సిందేనని చెప్పారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఫ్యాక్టరీ లేక ఇబ్బందులు..
ఆయిల్‌పామ్ గెలలను కోసిన వెంటనే నిర్ణీత సమయంలో ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలో ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు సిద్ధిపేట జిల్లాకు తరలించాల్సి వస్తోంది. దీంతో రవాణా ఖర్చులు పెరగడంతోపాటు ఆలస్యమైతే గెలల నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సాగు చేయాలని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఫ్యాక్టరీ విషయంలో మాత్రం తాత్సారం చేయడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అక్కడ కాకపోతే ఎక్కడైనా..
జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చెలరేగిన ఆందోళనలు కొత్త పరిశ్రమలకు బ్రేక్ వేశాయి. ఇందులో సద రు పరిశ్రమ, అ ప్పటి పాలకులు, అధికారులూ ప్రజలకు ఇబ్బంది లేని స్థలాన్ని గుర్తించి ఇవ్వడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. ఇథనాల్‌తో పోలిస్తే ఆయిల్‌పామ్ ద్వారా కాలుష్య సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. పాక్‌పట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమకు డ్యామ్‌సేఫ్టీ, ఇరిగేషన్ క్లియరెన్స్ రాక ఆగిందంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన, గోదావరికి, మొసళ్ల మడుగుకు అతిసమీపంలో ఉండటంపైనా అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అవేవీ పెద్ద ఇబ్బందులు కావన్న వాదన కూడా ఉంది. మరోవైపు అక్కడ ఇబ్బందులు ఉన్నప్పుడు మరోచోట ఫ్యాక్టరీకి భూమి అప్పగించాలన్న డిమాండ్ కూడా వస్తోంది.


