లక్ష్మణచాంద: తెలంగాణలో యూరియా అక్రమ వినియోగం, పక్కదారి పట్టకుండా చేసేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ తెచ్చింది. అయితే ఈ యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యవసాయ శాఖ మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవను ప్రారంభించింది. ఈ కొత్త విధానంతో యాప్ ఉపయోగించలేని రైతులు కూడా సులభంగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు.
మీసేవ కేంద్రాల్లో బుకింగ్..
రాష్ట్ర వ్యవసాయ శాఖ తీసుకువచ్చిన నూతన విధానంలో భాగంగా యూరియా బుకింగ్ సేవ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫర్టి లైజర్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి, ఆపరేటర్ సహాయంతో యూరియా బు కింగ్ చేసుకోవచ్చు. ఈ చొరవను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మీసేవ, వ్యవసాయ శాఖ కలిసి అమలు చేస్తున్నాయి.
పాటించాల్సిన సూచనలు..
మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడీ బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలు మాత్రమే చెల్లుబాటవుతుంది. బుకింగ్ గడువు ముగిసేలోపు రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూ రియాను కొనుగోలు చేయాలి. సబ్సిడీ యూరి యా బుకింగ్‌ను అధికా రిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే చేయాలి. ఓటీపీ అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్‌బు క్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. కేవలం పది రూపాయల నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో), మండల వ్యవసాయ అధికారి (ఏవో)ను సంప్రదించాలి.
బుకింగ్ ప్రక్రియ ఇలా...
రైతు తన పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో సమీ పంలోని మీసేవ కేంద్రానికి వెళ్లాలరు. మీసేవ ఆపరేటర్ రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, పంట వివరాలు నమోదు చేస్తారు. రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూ రియా పరిమాణాన్ని బుక్ చేస్తారు. రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ధ్రువీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడీ జారీ అవుతుంది.


