రసాయన ఎరువులతో భూమికి ముప్పు విషపూరితమవుతున్న పంటలు యూరియా కొరత నేపథ్యంలో నానోను ప్రోత్సహిస్తున్న వ్యవసాయ శాఖ
లక్ష్మణచాంద: జిల్లాలో వానాకాలం పంటల సాగు మొదలైంది. వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారులు అంటున్నారు. జిల్లాకు వానాకాలం పంటకు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం జిల్లాలో 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అయితే యూరియా యాప్ బుకింగ్‌పై ఇప్పటికీ చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఇతర రైతులపై లేదా వ్యవసాయాధికారులపై యూరియా బుకింగ్ కోసం ఆధారపడాల్సి వస్తుంది. యూరియా బుకింగ్‌తో రైతులకు కొంత మేరకు తిప్పలు తప్పడం లేదు. సాధారణ యూరియాకు బదులుగా నానో యూరియా ద్రావణం మార్కెట్‌లోకి వచ్చింది. నానో యూరియా వినియోగిస్తున్న రైతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. 2025–26 సంవత్సరంలో జిల్లా మొత్తం నానో యూరియా ద్రావణం 28 వేల లీటర్లు రైతులు వినియోగించారని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ తెలిపారు. ఈసారి సుమారు 35 వేల లీటర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న సాగు వ్యయాలు..
అధిక దిగుబడుల కోసం అవగాహన లేని రైతులు అధిక ఎరువులు వినియోగిస్తున్నారు. వ్యవసాయాధికారులు యూరియాను మోతాదుకు మించి వినియోగించవద్దని సూచించినా, రైతులు మాత్రం వినకుండా అధిక దిగుబడులు సాధించాలని ఎక్కువ యూరియాను వినియోగించడంతో సాగు ఖర్చులు అధికమవుతున్నాయి. యూరియా అధిక వినియోగంతో పంట మొక్కల ఆకులు ఎక్కువగా పెరిగి పంట బలహీనపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. మొక్కలు ఏపుగా పెరిగినా దిగుబడులు తగ్గుతుందని అంటున్నారు. తెగుళ్లు, పురుగుల దాడితో పంటకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అధికంగా యూరియాను వినియోగించడం వల్ల నేల సారం కోల్పోయి ఎరువు వృధా అవుతుందని, పంటలు విషతుల్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నానో వైపు అన్నదాతలు దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
జిల్లా సమాచారం....
మొత్తం సాగు విస్తీర్ణం 4.40 లక్షల ఎకరాలు
యూరియా అవసరం
30 వేల మెట్రిక్ టన్నులు
2025–26 నానో యూరియా వినియోగం
28 వేల లీటర్లు
ఈసారి నానో యూరియా వినియోగం
అంచనా 35 వేల లీటర్లు
అవగాహన కార్యక్రమాలు...
జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియాను మితంగా వినియోగించాలని కోరుతూ అన్ని రైతు వేదికల్లో, గ్రామాల్లో, రైతుల పంట పొలాల వద్ద డీఏవో అంజిప్రసాద్‌తోపాటు అన్ని మండలాల ఏవోలు, ఏఈవోలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు నానోవైపు మళ్లుతున్నారు. అమెరికా – ఇరాన్ యుద్ధం కారణంగా యూరియా దిగుమతి తగ్గింది. ఈ నేపథ్యంలోనూ రైతులు నానో యూరియా వాడడం మంచిదని సూచిస్తున్నారు. గత ఏడాది వానాకాలంలో వినియోగించే యూరియా కంటే జిల్లాలో 300 మెట్రిక్ టన్నుల వినియోగం తగ్గిందని, అలాగే ఇటీవల ముగిసిన యాసంగిలో 1,800 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం తగ్గిందని తెలిపారు. ఇంకా సాధారణ యూరియా వినియోగం తగ్గి రైతులు నానో వినియోగం పెంచాలని డీఏవో అంజిప్రసాద్ అంటున్నారు. జిల్లాలో 2025–26లో నానో యూరియా 28 వేల లీటర్లు, నానో డీఏపీ 6 వేల లీటర్లు రైతులు వినియోగించారు. ఈ సారి జిల్లా అంతటా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరింత నానో యూరియా వినియోగించేలా చర్యలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు.


