అంగన్‌వాడీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

Jun 16 2026 11:52 PM | Updated on Jun 16 2026 11:52 PM

● జిల్లాలో 81 టీచర్‌, 430 ఆయా పోస్టులు ఖాళీ ● త్వరలో నోటిఫికేషన్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలోని 81 టీచర్‌, 430 ఆయా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పక్షం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో ఖాళీలు..

జిల్లా వ్యాప్తంగా నిర్మల్‌, ఖానాపూర్‌, ముధోల్‌, భైంసా ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 931 సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో 850 మంది టీచర్లు, 501 ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 81 టీచర్లు, 430 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 65 ఏళ్లు నిండిన టీచర్లు, ఆయాలతో ఉద్యోగ విరమణ చేయించారు. దీంతో 511 ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి.

భర్తీ ప్రక్రియ ఇలా..

గతంలో పదో తరగతి చదివిన వారికి అంగన్వాడీ పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు విద్యార్హత ఇంటర్మీడియెట్‌కు పెంచారు. గతంలో మాదిరిగానే కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ కమిటీకి కలెక్టర్‌ ౖచైర్మన్‌గా ఉంటారు. ఆర్డీవో, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌(ఏజెన్సీ), డీఎంహెచ్‌వో, డీడబ్ల్యూవో సభ్యులుగా ఉంటారు. స్థానికులకే ప్రాధాన్యం ఇస్తారు.

మార్కుల కేటాయింపు..

మొత్తం 100 మార్కులతో భర్తీ ప్రక్రియ నిబంధనలు ప్రకటించారు. ఇందులో ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు మెరిట్‌ ఆధారంగా అత్యధికంగా 70 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేని వారికి 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు కలిపి మెరిట్‌ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. మొదలైన పైరవీలు..

చాలాకాలం తర్వాత అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అదే విధంగా తమకు పోస్టు ఇప్పించాలని రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరోవైపు టీచర్‌ పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, ఆయా పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తే పోస్టు ఇప్పిస్తామని దళారులు రంగప్రవేశం చేశారు.

ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు

ప్రాజెక్టు టీచర్లు ఖాళీలు ఆయాలు ఖాళీలు

భైంసా 205 18 205 76

ఖానాపూర్‌ 249 20 249 110

ముధోల్‌ 180 12 180 88

నిర్మల్‌ 297 31 297 156

మండలాలు 18 క్లస్టర్లు 4 సెక్టార్లు 37

అంగన్‌వాడీ కేంద్రాలు 931

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement