నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగింది. కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీతో మంగళవారం పొద్దుపోయే వరకు జేఏసీ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. కానీ కమిటీ నాలుగు వారాల గడువు అడిగింది. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని జేఏసీ నిర్ణయించింది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంసహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు.
నిలిచిన ఆర్టీసీ బస్సులు..
నిర్విరామంగా పరుగులు తీస్తున్న ఆర్టీసీ బస్సులు సమ్మెతో జిల్లాలోనూ నిలిచిపోయాయి. రెండు డిపోలలో బుధవారం నుంచి బస్సులకు బ్రేక్ పడింది. ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి.
రోజుకు రూ.60 లక్షల నష్టం..
నిర్మల్ డిపోలో 156 బస్సులు, భైంసా డిపోలో 75 కలిపి మొత్తంగా 231 బస్సులు నడుస్తున్నాయి. నిర్మల్ డిపోలో డ్రైవర్లు 140, కండక్టర్లు 209 అలాగే భైంసా డిపో పరిధిలో 47 మంది డ్రైవర్లు, 48 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు డిపోల పరిధిలో బస్సులు దాదాపు రోజూ లక్ష కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, రూ.60 లక్షల ఆదాయం వస్తోంది. సమ్మె నేపథ్యంలో ఆదాయం సంస్థ కోల్పోతుంది.


