నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం మాట్లాడారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందన్నారు. వివిధ శాఖల అధికారులు తమ విభాగాల పరిధిలో చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు కూడా విజయవంతంగా సాగాయన్నారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలను సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొనడం సంతోషకరమని, రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో దుర్గాప్రసాద్, వైద్యశాఖ అధికారి సౌమ్య, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.


