పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
నిర్మల్ రూరల్: ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి జాదవ్ పరుశురాంనాయక్ తెలిపారు. ఇప్పటికే పరీక్షల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి ’తో మాట్లాడారు.
సాక్షి: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరుకానున్నారు?
డీఐఈవో: ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 13,125 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం 6,652 మంది, ద్వితీయ సంవత్సరం 6,473 మంది రాయనున్నారు.
సాక్షి: పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ?
డీఐఈవో: పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశాం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 5 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతిస్తాం.
సాక్షి: జిల్లాలో ఎన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు?
డీఐఈవో:మొత్తం 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో జిల్లా కేంద్రంలో 8, భైంసాలో 3, ఖానాపూర్, ముధోల్‌లో 2, తానూర్, కుభీర్, లోకేశ్వరం, కుంటాల, దిలావర్‌పూర్, సారంగాపూర్, మామడ, కడెంలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశాం.
సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు?
డీఐఈవో:ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, రెండు సెట్టింగ్స్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశాం. ప్రతీ సెంటర్‌కు ఒక సీఎస్, ఒక డీవో ఉంటారు. ఇప్పటికే వీరికి ట్రైనింగ్ పూర్తిచేసాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో గదిలో 25 నుంచి 30 మందికి ఒక ఇన్విజిలేటర్‌ను నియమించాం.
సాక్షి: విద్యార్థులకు హాల్‌టికెట్లను ఎప్పటినుంచి అందిస్తారు?
డీఐఈవో:ఇప్పటికే సంబంధిత ప్రిన్సిపాళ్లు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు వచ్చే లింకు డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్లు తీసుకోవచ్చు. దానిపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తాం. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుస్తుంది.
సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏంటి?
డీఐఈవో:అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షల్లో 24 పేజీల సమాధానపత్రం అందజేస్తాం. అందులో మాత్రమే జవాబులు రాయాలి. అడిషనల్ పేపర్లు ఇవ్వబడవు. ప్రశాంతంగా పరీక్షలు రాయండి. విజయీభవ.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు


