సరిహద్దులో కూరగాయల పంట
ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న రైతులు రవాణా సౌకర్యం లేక ఇక్కట్లు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలకు ఎదురుచూపు
తానూరు: నిర్మల్ వ్యవసాయ ఆధారిత జిల్లా. 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో సోయా, వరి, పత్తి ప్రధాన పంటలు అయితే సంప్రదాయ పంటలకు భిన్నంగా తానూర్ మండలం జౌలా(కె), వడ్గాం, కోలూరు, కళ్యాణి, జౌలా(బి), ఖర్బాలా, హిప్నెల్లి, ఎల్వి, దాగాం, నంద్గాం, మొగ్లి, బోరిగాం గ్రామాల రైతులు కూరగాయల సాగుతో ఆర్థికంగా స్థిరపడుతున్నారు. సీజన్‌లతో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటలు వేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. పంట ఉత్పత్తులను స్థానికంగా, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ మార్కెట్లకు పంపి మంచి ఆదాయం పొందుతున్నారు.
మార్కెట్ డిమాండ్ మేరకు సాగు..
గతంలో ఈ రైతులు పత్తి, సోయాపై ఆధారపడేవారు. మార్కెట్ అవసరాలను గుర్తించి కూరగాయ ల సాగువైపు మళ్లారు యాసంగిలో మొక్కజొన్న, గోధుమలతోపాటు ఎకరం లేదా రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. బావులు, బోర్లలో నీరు ఉంది. రెండు నెలల శ్రమతో పంటలు చేతికొస్తున్నాయని, ఇతర పంటల ఖర్చులను కవర్ చేస్తూ లాభాలు ఇస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
250 ఎకరాల్లో పంటలు..
అధికారుల అంచనాల ప్రకారం యాసంగి మండలంలో 250 ఎకరాల్లో వివిధ కూరగాయలు పండిస్తున్నారు. వంకాయలు, టమాటాలు, క్యాబేజీ, మి ర్చి, బెండకాయలు, కాయకూరలు, కొత్తమీర, మెంతికూర, పాలకూర, కరివేపాకు వంటివి ప్రధానం. తక్కువ నీటితో పంటలు వచ్చేందుకు చుట్టుపక్క గ్రామాల రైతులు ఆసక్తి చూపుతున్నారు.
‘మహా’ రైతుల స్ఫూర్తి..
మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. పక్క రాష్ట్రంలో రైతుల లాభాలు చూసి స్ఫూర్తి పొందారు. బోరు బావులు ఉన్న స్థానికులు ఈ పంటలకు మొగ్గు చూపారు. పదేళ్లుగా జౌలా, వడ్గాం, కళ్యాణి, ఖర్బాలా, కోలూరు, మొగ్లి గ్రామాల్లో రైతులంగా కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. పంటలను నిజామాబాద్, భైంసా, ముధోల్, ధర్మాబాద్, ఉమ్రి పట్టణాలకు ప్రత్యేక వాహనాల్లో పంపుతున్నారు. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సరిహద్దులో కూరగాయల పంట
సరిహద్దులో కూరగాయల పంట


