మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
ఎన్నికల కోడ్ ముగిసే వరకు ర్యాలీలు, రాస్తారోకోలు నిషేధం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా చూస్తామని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కఠినంగా కోడ్ అమలు..
ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు. డబ్బు, మద్యం, ఓటర్ల ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన సిబ్బంది అందుబాటులో ఉంటారని, అవసరమైతే అదనపు బలగాలను మొహరించి ఓటర్లకు భద్రత కల్పిస్తామని వెల్లడించారు.
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి..
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లైసెన్స్ ఆయుధాలు ఉన్నవారు సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని ఆదేశించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
ర్యాలీలు, ధర్నాలు నిషేధం
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించొద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విద్వేషపూరిత లేదా రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతియుత ఎన్నికలు విజయవంతమవుతాయని, అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని కోరారు.


