మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి మంగళవారం మాట్లాడారు. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానా పూర్ మున్సిపాలిటీల్లో 244 పోలింగ్ కేంద్రాల్లో, 80 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆర్వోలు, ఏఆర్వోలు, ఇతర అధికారుల విధులకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 30వ తేదీ, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని పేర్కొన్నారు. బుధవారం నుంచే వార్డుల వారీ గా ఎలక్టరోల్స్ ప్రదర్శిస్తామన్నారు. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన పూర్తి చేయడంతో పాటు, చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ను ప్రదర్శిస్తామన్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి, 13న ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలన్నారు.
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు..
అనంతరం ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నా రు. నామినేషన్ల స్వీకరణ మొదలుకుని, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు బందోబస్తు కల్పిస్తామన్నారు. మద్యం, నగదు రవాణాపై నిఘా ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, భైంసా ఏఎస్పీ రాజేవ్‌మీనా, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, సుందర్‌సింగ్ పాల్గొన్నారు.


