ఎవరికీ పట్టని వేదికలు
40 నెలలుగా రైతు వేదికలకు అందని నిధులు పెండింగ్‌లో రూ.2,84,40,000 ఇబ్బంది పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు
నిర్మల్‌చైన్‌గేట్/భైంసారూరల్: రైతులకు లాభదాయక సాగు పద్ధతులు, చీడపీడల నియంత్రణ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సాధించే మార్గాలు సూచించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించింది. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయితో పంటల పరిశీలన చేస్తారు. నాలుగేళ్ల క్రితం జిల్లాలో 18 మండలాల్లో 79 క్లస్టర్లకు వ్యవసాయ ఇంజినీరింగ్ అధికారులు వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, ఉపాధి హామీ పథకం నుంచి రూ.10 లక్షలతో నిర్మించారు.
అధికారుల సొంత ఖర్చు
నిధులు రాకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు సొంత డబ్బులతో వేదికలను నడుపుతున్నారు. ఉదయం–సాయంత్రం అందుబాటులో ఉంటూ రైతులకు సాగు సలహాలు, శిక్షణ ఇస్తున్నారు. ఈ సౌకర్యాలు లేకపోతే రైతులకు క్షేత్రస్థాయి మార్గదర్శకత్వం లోపిస్తుంది. అయితే అధికారులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే, రైతుల అభివృద్ధికి ఇది బలమైన సాధనంగా మారుతుంది.
నిర్వహణ ఖర్చులు..
ప్రతీ రైతు వేదికకు నెలకు రూ.9 వేల నిధులు మంజూరు చేసి, తాగునీరు (రూ.500), శుభ్రత (రూ.3,000), సరఫరా సామగ్రి (రూ.1,000), విద్యుత్ చార్జీలు (రూ.1,000), మరమ్మత్తులు (రూ.1,000), నెలలో 8 సమావేశాలకు టీ–స్నాక్స్(రూ.2,500) వంటి ఖర్చులు చేపట్టాలి. జిల్లా మొత్తంగా 79 వేదికలకు నెలకు రూ.3.60 లక్షలు అవసరం. 2022, ఆగస్టు వరకు నిధులు క్రమబద్ధంగా వచ్చాయి. అనంతరం 40 నెలలుగా మంజూరు ఆగిపోయింది. ఫలితంగా రూ.2.84 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.


