
స్త్రీ నిధి రుణ బకాయిలు రూ.16 కోట్లు
● రీజనల్ మేనేజర్ పూర్ణచందర్
బోథ్: జిల్లా వ్యాప్తంగా రూ.16 కోట్ల శ్రీనిధి రుణాలు పేరుకుపోయాయని స్త్రీనిధి రీజనల్ మేనేజర్ పూర్ణచందర్ అన్నారు. రుణాలు చెల్లించకపోతే ఆయా గ్రామాల్లోని మిగతా మహిళా సంఘాలకు సైతం భవిష్యత్‌లో రుణాలు మంజూరు చేసే వీలుండదన్నారు. బుధవారం ఐకేపీ కార్యాలయాన్ని సందర్శించి సీసీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు రూ.112 కోట్ల రుణాలు ఇచ్చామని, ప్రస్తుతం రూ.16 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. మహిళలకు రూ.50 వేల నుండి రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని అన్నారు. రుణాలు పొందిన మహిళలకు బీమా చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందితే రూ. 10 లక్షలు, సాధారణ మరణానికి రూ.2 లక్షల వరకు బీమా ఉందన్నారు. ఆయా సంఘాలు రుణాలు చెల్లించాలని అన్నారు. సమావేశంలో ఏపీఎం మాధవ, తదితరులు పాల్గొన్నారు.