మాకు ప్రాణభిక్ష పెట్టండయ్యా.. | Women farmers and farm laborers from Mamillapalli appeal to the National Human Rights Commission | Sakshi
Sakshi News home page

మాకు ప్రాణభిక్ష పెట్టండయ్యా..

Jun 5 2026 5:42 AM | Updated on Jun 5 2026 5:42 AM

Women farmers and farm laborers from Mamillapalli appeal to the National Human Rights Commission

ఏపీ పోలీసుల తీరువల్ల రాష్ట్రంలో బతకడం కష్టంగా ఉంది 

బూతులు తిడుతూ ఈడ్చి తంతాం.. చంపేస్తాం.. అంటూ బెదిరించారు 

మహిళలమని కూడా చూడకుండా అసభ్యకరంగా వ్యవహరించారు  

ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ, మహిళా కమిషన్‌ల వద్ద మహిళా రైతులు, రైతు కూలీల ఆవేదన 

మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండపై ఫిర్యాదు 

పోలీసులు వ్యవహార శైలిపై వీడియో ఫుటేజీ ఆధారాలు అందజేత  

పోలీసుల తీరుపై కమిషన్ల చైర్మన్లు తీవ్ర ఆగ్రహం 

తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ

సాక్షి, న్యూఢిల్లీ: ‘మొక్కజొన్నకు ధర లేకపోవడంతో మేం గోదాములో పంట నిల్వ చేసుకున్నాము. మేమంతా అక్కడున్న సమయంలో ఆ గోదాముపై టీడీపీకి చెందిన కొందరు గూండాలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు రోప్‌లను మా మెడలకు వేసి మమ్మల్ని లాగి కిందకు పడేశారు. పచ్చి బూతులు తిడుతూ ఈడ్చి తంతాం.. చంపేస్తాం.. అంటూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. మాకు పోలీసుల నుంచి ప్రాణభిక్ష పెట్టండయ్యా..’ అంటూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన మహిళా రైతులు, రైతు కూలీలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్‌లకు మహిళా రైతు, రైతు కూలీలు విజ్ఞప్తి చేశారు. 

మహిళలమని కూడా చూడకుండా అసభ్యకరంగా తాకుతూ భయభ్రాంతులకు గురిచేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసుల వ్యవహారంపై వీడియో ఫుటేజీ ఆధారాలను అందజేశారు. దీనికి స్పందించిన కమిషన్ల చైర్మన్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకుంటామని  భరోసా ఇచ్చారు. 

మామిళ్లపల్లిలో ఇటీవల జరిగిన ఖాకీల దౌర్జన్యకాండపై వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ తనూజారాణి నేతృత్వంలో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ విజయ కిశోర్‌ రహత్కర్, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిశోర్‌ మక్వానా, సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌లను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. 

వీరి వెంట మామిళ్లపల్లికి చెందిన మహిళా రైతులు ఇక్కుర్తి సుజాత, అంబటి పార్వతి, లక్ష్మి, అంబటి సామ్రాజ్యం, మహిళా రైతు కూలీలు, బాధితులు కూచిపూడి మరియరాణి, యాతం మమత, కొమ్ము మరియమ్మ, దాసరి దానమ్మ, వైఎస్సార్‌సీపీ మహిళా నేత గుంటూరు శ్రీరెడ్డిలు ఉన్నారు.  

పోలీసులే రౌడీలుగా మారారు 
వైఎస్సార్‌సీపీ ఎంపీల విమర్శ 
కమిషన్ల చైర్మన్లతో భేటీ అనంతరం రైతులతో కలిసి  ఎంపీలు డాక్టర్‌ తనూజా రాణి, గొల్ల బాబూరావు, పొన్నూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వ దమనకాండను ఎండగట్టారు. పోలీసులే రౌడీలుగా మారి ఎస్సీ మహిళా రైతుల మీద దాడులు చేశారని  డాక్టర్‌ గుమ్మా తనూజారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మహిళలను  మహారాణులుగా చూసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 

మహిళలని కూడా చూడకుండా వారిపై పోలీసులు భౌతికంగా దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని గొల్ల బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో కాపు మహిళా రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. వారికి అండగా నిలిచిన రైతు కూలీలైన ఎస్సీ మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారని విమర్శించారు.     

Advertisement
 
Advertisement
Advertisement