ఆమరణ దీక్ష భగ్నం.. పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్‌

Widows of Pulwama martyrs detained from protest site Rajasthan - Sakshi

జైపూర్‌: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్‌ల భార్యలను రాజస్థాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు డిమాండ్లతో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌  జవాన్ల భార్యలు జైపూర్‌లోని సచిన్‌ పైలట్‌ ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో  శుక్రవారం దీక్షను భగ్నం చేసి.. స్థానిక స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ నివాసం ఎదుట ఫిబ్రవరి 28వ తేదీ నుంచి  ఈ ముగ్గురు మహిళలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో సచిన్‌ పైలెట్‌ ఆ ముగ్గురితో మాట్లాడినా కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో.. తమ దీక్షను ఆమరణ దీక్షగా మార్చుకున్నారు వాళ్లు. అయితే శుక్రవారం ఈ ముగ్గురిని అరెస్ట్‌ చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు. అరెస్ట్‌ క్రమంలో పోలీసులు ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించగా.. సచిన్‌ పైలట్‌ పోలీసుల తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్‌ మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందంటూ రాజస్థాన్‌ డీజీపీ లేఖ రాసి.. ఘటనపై వివరణ కోరింది.

ఇదిలా ఉంటే.. అమర వీరుల కుటుంబ సభ్యులకు సాధారణంగా ప్రభుత్వాలు ఉద్యోగాలను ప్రకటిస్తుంటాయి. అయితే తమ పిల్లలకు బదులుగా బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ మేరకు అవసరమైతే రూల్స్‌ సవరించాలని ఈ ముగ్గురు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు.. తమ గ్రామాలకు రోడ్లు వేయించాలని, ఊరి నడిబొడ్డున తమ భర్తల విగ్రహాలు ఏర్పాటు చేయించాలని కోరారు.  దీనిపై ట్విటర్‌ ద్వారా స్పందించిన సీఎం అశోక్‌ గెహ్లాట్‌.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

అయితే రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని చెబుతూ.. తమ దీక్షను కొనసాగించారు వాళ్లు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాల ఆధారంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అయితే దీనిని రాజకీయం చేయడం సరికాదని అంటున్నారు సీఎం గెహ్లాట్‌.

జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన.. శ్రీనగర్ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్‌ మీద ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులు కాగా, యావత్‌ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top