
నేపాల్‌లో యువత(Gen Z) చేపట్టిన ఆందోళనలు దేశ రాజకీయాలను శాసించాయి. నిరసనలు హింసాత్మక మలుపు తిరగడం, ఆర్మీ రంగంలోకి దిగినా పరిస్థితి అదుపు రాకపోవడం, పైపెచ్చు నేతలు.. వాళ్ల ఆస్తులపై దాడులతో పరిస్థితి మరింత విషమించింది. ఈ దెబ్బకు.. కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే.. రాజకీయ సంక్షోభం దరిమిలా నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. విధ్వంసాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ జాతిని ఉద్దేశిస్తూ గత అర్ధరాత్రి ప్రసంగించారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలే మార్గమని అన్నారాయన. అదే సమయంలో విధ్వంసం, దాడులు, దోపిడీ వంటి చర్యలు కొనసాగితే.. ఆర్మీ కఠినంగా స్పందిస్తుంది అని ప్రకటించారు.
ఆర్మీ ఇప్పటికే కీలక ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకుంది. ట్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సింగదుర్బార్, పార్లమెంట్ భవనం వంటి ప్రదేశాల్లో సైనికులు మోహరించారు. గత రాత్రి 10 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. అయితే..
ఇది కేవలం సోషల్ మీడియా నిషేధంపై స్పందన కాదని యువత అంటోంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నాయకులు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని అంటోంది. అలాగే.. రాజ్యాంగాన్ని తిరగరాసి పాలనలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని అంటోంది. ఈ క్రమంలో.. ఉద్యమ నిర్వాహకులు తమ కీలక డిమాండ్లు ప్రకటించారు. అందులో..
• నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించడం
• వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం, గుర్తింపు & ఆర్థిక సహాయం అందించడం
• నిరుద్యోగం, వలస, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు
• కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపనకు పిలుపు
ఈ ఉద్యమం ఏ పార్టీకి లేదంటో వ్యక్తికి చెందింది కాదు. ఇది ఒక తరం కోసం.. దేశ భవిష్యత్తు కోసమే అని పేర్కొంది. శాంతి అవసరమే అని, కానీ, అది కొత్త రాజకీయ వ్యవస్థ పునాది మీదే సాధ్యమవుతుంది అని పేర్కొంది.
Gen Z ఉద్యమం.. టైమ్‌లైన్
4 సెప్టెంబర్ 2025
నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించింది (Facebook, YouTube, Instagram, X, Reddit, Snapchat).
కారణం: కంపెనీలు స్థానికంగా నమోదు చేయకపోవడం, గ్రీవెన్స్ హ్యాండ్లర్ నియామకం చేయకపోవడం.
8 సెప్టెంబర్ 2025
Gen Z యువత పెద్ద ఎత్తున మైతీఘర్ మండల, న్యూ బనేశ్వర్ ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.
పార్లమెంట్ ఆక్రమణ ప్రయత్నం, తీగాస్, వాటర్ కేనన్, రబ్బరు బుల్లెట్లుతో పోలీసుల స్పందన.
19 మంది మరణం, 300 మందికి పైగా గాయాలు.
సాయంత్రం: ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని వెనక్కి తీసుకుంది.
హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా.
కర్ఫ్యూ: కాఠ్మాండూ, పోఖరా, బిర్గంజ్, బుట్వాల్, భైరహవా, ఇటహరి, దమక్.
9 సెప్టెంబర్ 2025
ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది, నిషేధం ఎత్తివేసినప్పటికీ నిరసనలు కొనసాగాయి.
ప్రధానమంత్రి కెపీ శర్మ ఓలి రాజీనామా చేసి శివపురి ఆర్మీ క్యాంప్‌లో ఆశ్రయం పొందారు.
పార్లమెంట్, సింగదుర్బార్, సుప్రీం కోర్ట్, సీతల్ నివాస్, బాలువటార్ వంటి ప్రభుత్వ భవనాలు దాడికి గురయ్యాయి.
ఉమ్మెద్ పార్టీ, నెపాలి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు ధ్వంసం.
నెపాల్ ఆర్మీ: త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంను నియంత్రణలోకి తీసుకుంది, విమాన సేవలు నిలిపివేత.
10 సెప్టెంబర్ 2025
అలర్లు కొనసాగుతున్నాయి, ప్రజల భద్రత కోసం ఆర్మీ చర్యలు.
అధికారికంగా 23 మంది మరణించారు, ఇందులో 3 పోలీసు అధికారులు, ఝలానాథ్ ఖనాల్ భార్య కూడా ఉన్నారు.
347 మంది గాయపడినట్లు అధికారిక సమాచారం, 422+ అనధికారిక గణాంకం.
నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ (Ram Chandra Poudel), ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో జనరేషన్ జెడ్ ఉద్యమ నిర్వాహకులు చర్చలు జరపాల్సి ఉంది.
నేపాల్‌కు స్వాతంత్ర దినోత్సవమంటూ ప్రత్యేకంగా లేదు. ఎందుకంటే.. అది ఏ దేశపు పాలన కింద లేదు. కానీ 1923 డిసెంబర్ 21న నేపాల్-బ్రిటన్ మధ్య Singha Durbar Treaty కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా నేపాల్ స్వతంత్ర దేశంగా బ్రిటన్ అధికారికంగా గుర్తించింది. అయితే.. రాణా పాలన ముగిసిన ఫిబ్రవరి 18వ తేదీని ప్రజాస్వామ్య దినోత్సవం (Democracy Day)గా, రాచరికం ముగిసి ప్రజాస్వామ్యం ఏర్పడిన తేదీ మే 28వ తేదీని గణతంత్ర దినోత్సవం (Republic Day)గా నిర్వహిస్తోంది.
దఫదఫాలుగా రాజ్యాంగం..
1948లో గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ద్వారా తొలి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి రాణా, రాజకీయ సంస్కరణలకు నిరాకరించడంతో అది నామమాత్రంగానే ఉండిపోయింది. ఆ తర్వాత.. రాజు త్రిభువన్ బిర్ బిక్రమ్ షా 1951లో ఇంటీరియమ్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి మార్గం వేసింది. 1990లో ప్రజా ఉద్యమం తర్వాత.. కానిస్టిట్యూషనల్ మోనార్చీ అనేది బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థకు మార్గం వేసింది.
2007లో ఇంటీరియమ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ అనేది రాచరికాన్ని పూర్తిగా తొలగించి.. ప్రజాస్వామ్య పునాది వేసింది. ఇది 2008లో రాజ్యాంగ సభ మొదలైన తర్వాత పూర్తిగా అమలులోకి వచ్చింది. అటుపై 2015 సెప్టెంబర్ 20న పూర్తిస్థాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది నేపాల్‌ను ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా ప్రకటించింది.
నేపాల్ రాజ్యాంగం అనేది ఒక తరం పోరాటం ఫలితం. ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, దేశ భవిష్యత్తుకు పునాది రాయిగా ఉండాలని అంతా భావించారు. సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలోనే నేపాల్ యువత ఆందోళనలు మొదలైనట్లు కనిపించినప్పటికీ.. రాజకీయ వారసత్వం, అవినీతిపైనే వాళ్ల పోరాటం సాగింది. ఈ నేపథ్యంలో నేపాల్ రాజ్యాంగం రాజకీయ నేతలకు అనుగుణంగా ఉందనేది ఇప్పుడున్న యువత అభిప్రాయం. అందుకే రేపటి తరం ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలో సమూల మార్పు కోరుకుంటోంది.