‘పెళ్లి చూసి చూడు..ఇల్లు కట్టి చూడు’ అనేది ఇప్పటికీ నూటికి నూరుపాళ్లు నిజం అనిపించే మాట. దీనికి ఇండియాలో కొనసాగుతున్న ట్రెండ్ మరింత ఆజ్యం పోస్తుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అనేదిఒకప్పటి మాట. ఇవాల్టి పెళ్లి ళ్ల ట్రెండ్ దీన్ని దాటేసి మరింత ముందుకు పోయింది. లక్షలకు, లక్షలకు కుమ్మరించి, హంగూ ఆర్భాటాలతో నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్, షూట్‌లు, ఖరీదైన బట్టలు, డైమండ్ నగలు, ఖరీదైన రిసార్ట్‌లు, పెళ్లి పందిటిలో స్క్రీన్లు,డ్రోన్ కెమెరాలు, ఇక భోజనాల సంగతి సరేసరి ఇంత తతంగం లేనిది ఏ మధ్య తరగతి ఇంట్లో పెళ్లి జరగడంలేదు. తాజాగా ఒక పెళ్లి కొడుకు 10 డిమాండ్లు మాత్రం సంచలనంగా నిలిచాయి. అవేంటో చూద్దామా..
అసలే రానున్నది అంతా పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇప్పటి తరం లో కొంత మార్పు వచ్చినప్పటికీ గిప్ట్‌లు, కానుకలు పేరుతో తెరవెనుక, ఒప్పందాలు, భారీ ఎత్తు లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి. అబ్బాయి తరపు కుటుంబం గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు అమ్మాయి తరబు కుటుంబాలు శక్తికిమించి ఖర్చు చేస్తాయి, తమ కుమార్తె సంతోషంగా ఉంటుంది కదా అని అప్పు చేయడానికైనా వెనుకాడరు. కానీ ఒక వరుడు మాత్రం కట్నం వద్దు కానీ 10 కోరికలు అంటూ షేర్ చేసిన డిమాండ్లు అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి.
10 డిమాండ్లు ఏంటంటే..
ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.
అతని వధువు లెహంగాకు బదులుగా చీర ధరించాలి
పెళ్లిలో బిగ్గరగా, అసభ్యకరమైన సంగీతానికి బదులుగా, వాయిద్య సంగీతం ఉండాలి.
దండలు మార్చుకునే సమయంలో ప్రశాంతంగా తామిద్దరమే ఉండాలి. దండలు మార్చుకునేటపుడు ఎవరైనా వరుడ్నిగానీ, వధువును గానీ పైకి ఎత్తడం లాంటి చేస్తే..తక్షణం వాళ్లు వేదికను వీడాల్సి ఉంటుంది.
పెళ్లికి సంబంధించి ఇతర తంతులో కూడా ఫోటోగ్రాఫర్లు ,వీడియోగ్రాఫర్లు జోక్యం అస్సలు ఉండకూడదు.
వేడుక ప్రారంభమైన తర్వాత పూజారిని అస్సలు ఎవరూ అడ్డుకోకూడదు.
తాను , తన వధువు ఫోటోగ్రాఫర్లు అడిగి పిచ్చి పిచ్చి పోజులు ఇవ్వబోం.
వివాహం పగటిపూట జరగాలి. సాయంత్రం నాటికి బధాయి(వధువును అత్తారింటికి సాగనంపే వేడుక) అన్ని సర్దుకోవాలి. తద్వారా అర్థరాత్రి కార్యక్రమాలు 'అతిథులకు అసౌకర్యం' లాంటివి ఉండవు.
పెళ్లి తరువాత, వధూవరులు హగ్గులు, కిస్‌లు ఇలాంటివేవీ ఉండకూడదు.
అంతేకాదు ఇది అగ్ని దేవుడి సాక్షిగా జరిగే పవిత్ర పవిత్ర వివాహం, సినిమా షూట్ కాదు."

నెటిజన్లు ఏమన్నారంటే..!
ఈ డిమాండ్లు కొందరికి న్యాయంగా అనిపించినప్పటికీ, మరికొందరు మాత్రం వీటిని తోసిపుచ్చారు. కొంతమంది అతను చెప్పింది సహేతుకమే అన్నారు. అయితే కట్నం తీసుకోకపోవడం అక్షరాలా చట్ట విరుద్ధం.. అదేదో నువ్వు గొప్పవ్యక్తిలా ఫోజులివ్వనక్కర లేదు అని ఒకరు, వివాహంలో సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు బ్రో అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. పెళ్లి కూతురు పెళ్లిలో ఎలాంటి దుస్తులు ధరించాలో, పెళ్లి కొడుకు ఎందుకు డిసైడ్ చేయాలి అని కొందరు విమర్శించారు. "ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాకే అసహనానికి లోనైతే అతను పెళ్లి చేసుకుని ఇతరుల జీవితాలను పాడుచేయకూడదు ఒక యూజర్ అన్నారు. మరికొందరు అతన్ని సమర్థిస్తూ, "ఇది చాలా బాగుంది !!! వివాహం అనేది ఒక పవిత్ర బంధం, ఇన్‌స్టాగ్రామ్ లైక్‌ల కోసం కాదు !!!" అని అన్నారు.


