ఉద్దవ్‌ సేనలో చీలిక.. ఎవరీ సంజయ్ జాధవ్? | Who Is Sanjay Jadhav? Key Face in Sena UBT Split | Sakshi
Sakshi News home page

ఉద్దవ్‌ సేనలో చీలిక.. ఎవరీ సంజయ్ జాధవ్?

Jun 18 2026 1:55 PM | Updated on Jun 18 2026 2:19 PM

Who Is Sanjay Jadhav? Key Face in Sena UBT Split

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్‌ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. 

శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. 

మొత్తం తొమ్మిది మంది UBT లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్‌ ఠాక్రే సీరియస్‌గా తీసుకున్నారు.  హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.  అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది. 

మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్‌కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్‌) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంజయ్ హరిభావు జాధవ్.. అందరూ ‘‘బండు భాయ్‌’’ అని పిలుచుకుంటారు. శివసేనలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. పర్భణీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.

రెండుసార్లు పర్భణీ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆపై హ్యాట్రిక్‌ ఎంపీగా అదే లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. సాధారణ శివసేన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నేతగా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అయితే గతంలోనే పార్టీ అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయన పేరు వివాదాల్లో కూడా వినిపించింది. 2020లో మిత్రపక్షం ఎన్సీపీ వైఖరి కారణంగా కేడర్‌కు న్యాయం చేయలేకపోతున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఎంపీ పదవికి రాజీనామా చేయబోయారు. అయితే ఉద్దవ్‌ సర్దిచెప్పడంతో దానిని వెనక్కి తీసుకున్నారు.

ఇప్పుడు శివసేన (UBT)లో జరుగుతున్న పరిణామాలు ఆయన చుట్టూ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు నిబద్ధమైన, పార్టీ కార్యకర్తల పక్షాన నిలిచే విధేయ శివసైనికుడిగా ఆయనను చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉద్దవ్‌ చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.

మరోవైపు,  ఉద్దవ్‌ సేన నేత సంజయ్ రౌత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ పార్టీ బలాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. “పార్టీకి రాని వారు మనవారు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, శివసేన (UBT) లోక్‌సభ శిబిరంలో విభజన దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంజయ్ బండు జాధవ్ వంటి అనుభవజ్ఞుడైన నేత పేరు ముందుకు రావడంతో శివసేన (UBT)లో చీలిక అంశం మరింత సీరియస్‌గా మారిదంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement