breaking news
fraction
-
టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు వర్గాలు పార్టీ మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే ఎంపీల వర్గం విలీనం పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల వర్గం ఆమెను పార్టీ చైర్పర్సన్ పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించడమే కాకుండా.. కొత్త నాయకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని కూడా చెబుతోంది. దీంతో టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరో మలుపు తిరిగినట్లైంది.ప్రతిపక్ష నేత(తాత్కాలిక) రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నేతృత్వంలోని అసంతృప్త వర్గం సోమవారం కోల్‌కతాలోని న్యూ టౌన్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు సహా దాదాపు 500 మంది టీఎంసీ నాయకులు హాజరైనట్లు తిరుగుబాటు వర్గం ప్రకటించింది. ఈ సమావేశంలో 30 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని (National Working Committee) ఏర్పాటు చేస్తూ, తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించారు.కొత్త అధినేత అరూప్ రాయ్సమావేశంలో ఎమ్మెల్యే అనూప్ రాయ్‌ను కొత్త చీఫ్‌గా ఎన్నుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. అలాగే మాజీ కోల్‌కతా మేయర్ ఫర్హిద్ హకీమ్ , అరోప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా, అఖ్రుజ్జమాన్ అన్సారిని ఖజానాదారుగా నియమించినట్లు ప్రకటించారు.ఎవరీ అరూప్?అరూప్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. హౌరా ప్రాంతానికి చెందిన ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, మమత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం టీఎంసీలో తిరుగుబాటు వర్గం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అరూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఒకప్పుడు మమతకు నమ్మినబంటుగా ఉన్న నేతే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.మమతకి మరో చాన్స్మమత బెనర్జీని పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయలేదని, ఆమె కోరుకుంటే ప్రధాన సలహాదారుగా (Chief Advisor) వ్యవహరించవచ్చని తిరుగుబాటు వర్గం వ్యాఖ్యానించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా, 2022లో ఏర్పాటైన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.మమత, అభిషేక్ ఫొటోలకు చోటు లేదు!తిరుగుబాటు వర్గం నిర్వహించిన సమావేశంలో టీఎంసీ పార్టీ గుర్తు కనిపించినప్పటికీ, మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫొటోలు కనిపించకపోవడం గమనార్హం. ఇది పార్టీపై తమ హక్కును ప్రకటించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.టీఎంసీ క్రమశిక్షణా చర్యలుమరోవైపు అధికారిక టీఎంసీ నాయకత్వం కూడా వేగంగా స్పందించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్హాద్ హకీమ్, అరోప్ బిశ్వాస్, అరూప్ రాయ్, జావేద్ ఖాన్, రతిన్ ఘోష్, బిప్లబ్ మిత్రా, స్నేహాశిష్ చక్రవర్తి, సబీనా యాస్మిన్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఎంపీల దారి వేరే..!టీఎంసీలో అసంతృప్తి ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. ఇప్పటికే 20 మంది తిరుగుబాటు ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెబుతూ **నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)**లో విలీనమయ్యారు. అంతేకాదు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించారు. త్రిపురలో వెయ్యి ఓట్లకే పరిమితమైన ఓ అనామక పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.ఒరిజినల్ టీఎంసీ ఏది?పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే టీఎంసీలో అసంతృప్తి స్వరాలు వినిపించడం మొదలైంది. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో నాయకత్వానికే సవాల్ విసిరిన ఘటన ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు తిరుగుబాటు వర్గం తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తుండగా, మరోవైపు అధికారిక నాయకత్వం క్రమశిక్షణా చర్యలకు దిగింది. దీంతో పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులు, నాయకత్వంపై పోరు మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!ఇప్పటివరకు ఇది కేవలం రాజకీయ తిరుగుబాటులా కనిపించినా.. అసలు పోరు ఇకపై ఎన్నికల సంఘం వద్ద జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. "అసలైన తృణమూల్ కాంగ్రెస్" ఎవరిది? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికుంది? తిరుగుబాటు వర్గం బలం ఎంత? మమతా బెనర్జీ తదుపరి అడుగు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లోనే తేలనున్నాయి. అందుకే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క అంశంపైనే ఉంది... టీఎంసీ సంక్షోభం అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైందా?. -
ఉద్దవ్ సేనలో చీలిక.. ఎవరీ సంజయ్ జాధవ్?
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. మొత్తం తొమ్మిది మంది UBT లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్ ఠాక్రే సీరియస్‌గా తీసుకున్నారు. హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది. మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్‌కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంజయ్ హరిభావు జాధవ్.. అందరూ ‘‘బండు భాయ్’’ అని పిలుచుకుంటారు. శివసేనలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. పర్భణీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.రెండుసార్లు పర్భణీ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆపై హ్యాట్రిక్ ఎంపీగా అదే లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. సాధారణ శివసేన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నేతగా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అయితే గతంలోనే పార్టీ అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయన పేరు వివాదాల్లో కూడా వినిపించింది. 2020లో మిత్రపక్షం ఎన్సీపీ వైఖరి కారణంగా కేడర్‌కు న్యాయం చేయలేకపోతున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఎంపీ పదవికి రాజీనామా చేయబోయారు. అయితే ఉద్దవ్ సర్దిచెప్పడంతో దానిని వెనక్కి తీసుకున్నారు.ఇప్పుడు శివసేన (UBT)లో జరుగుతున్న పరిణామాలు ఆయన చుట్టూ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు నిబద్ధమైన, పార్టీ కార్యకర్తల పక్షాన నిలిచే విధేయ శివసైనికుడిగా ఆయనను చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉద్దవ్ చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.మరోవైపు, ఉద్దవ్ సేన నేత సంజయ్ రౌత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ పార్టీ బలాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. “పార్టీకి రాని వారు మనవారు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, శివసేన (UBT) లోక్‌సభ శిబిరంలో విభజన దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంజయ్ బండు జాధవ్ వంటి అనుభవజ్ఞుడైన నేత పేరు ముందుకు రావడంతో శివసేన (UBT)లో చీలిక అంశం మరింత సీరియస్‌గా మారిదంటున్నారు. -
అన్నాడీఎంకేలో తారాస్థాయికి ముసలం.. జయ సమాధి వద్ద ఉద్రిక్తత
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి తన పాయింట్‌ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. -
సహారా ఆస్తుల విక్రయానికి రంగం సిద్ధం
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ ఆస్తులను విక్రయించాలన్న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల మేరకు రంగం సిద్ధమైంది. సహారా అధిపతి సుబ్రతో రాయ్ చెల్లించాల్సిన అప్పుల్లో భాగంగా, అన్యాక్రాంతంకాని, తనఖాలోలేని సహారా ఆస్తులను వేలం వేయాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కి మాండేటరీ ఆదేశాలను సుప్రీం జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహారా ఆస్తుల ఆన్లైన్లో వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంలో హెచ్డీఎఫ్సీ రియాల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్)కు సెబీ నియమించింది. దేశవ్యాప్తంగా 87సహారా ఆస్తులను ఆన్లైన్ ద్వారా వేలం వేసే ప్రక్రియను ఆ సంస్థలు ప్రారంభించాయి. హెచ్డీఎఫ్సీ రియాల్టీ 31 ఆస్తులను వేలం వేయనుండగా, మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ దాదాపు రూ.2,400 కోట్ల ధర పలకొచ్చని అంచనా. అటు ఎస్బీఐ కాపిటల్స్ మార్కెట్స్ మరో కొన్ని ఆస్తులను వేలం వేయనుండగా, వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.4,000 కోట్లు ఉండొచ్చని అంచనా. అంటే మొత్తం రూ.6,500 కోట్ల ఆస్తులను వేలం వేయనున్నారు. దేశంలోని పలు నగరాల్లోని ప్లాట్లు, వ్యవసాయ, నివాసిత, వాణిజ్య-పారిశ్రామిక భూములు వంటివి ఈ ఆస్తుల్లో ఉన్నాయి. ప్లాట్లను ఆన్లైన్ ద్వారా వేలం వేసే తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. మరోవైపు ఇది భారీ అమ్మకమని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని భావిస్తున్నాన్నారు. దేశంలో 30 నగరాల్లో విస్తరించి ఉన్న 87 రకాల ఆస్తులను విక్రయానికి రంగం సిద్దమైందన్నారు. దీనికి సంబంధించిన బ్యాంకు ప్రకటన త్వరలోనే వార్తాపత్రికలలో రావచ్చని సమాచారం. అయితే ఈ విక్రయంలో విదేశాల్లోని మూడు ప్రముఖ హెటెళ్లు, ప్రముఖ ఆంబీ వాలీ రిసార్ట్ ,ముంబైలోని సహారా స్టార్ హెటల్ ను మినహాయించారు. కాగా ఆర్ధిక నేరాల ఆరోపణలతో సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ (67) మార్చి 4 , 2014నుంచీ తీహార్ జైల్లో ఉన్నారు. రాయ్‌కి బెయిల్ మంజూరు చేయాలంటే రూ.5 వేల కోట్ల నగదు, అంతేమొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని, ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.36 వేల కోట్లను పూర్తిగా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. ఇటీవల ఆయన తల్లి అంత్యక్రియల నిమిత్తం మే 6 న నాలుగు వారాల బెయిల్ (పెరోల్) మంజూరైన సంగతి తెలిసిందే. -
వెంటాడి... వేటాడి...
జలుమూరు: వారంతా దగ్గరి బంధువులే. చిన్న పొలం విషయమై తలెత్తిన తగాదా నాలుగేళ్లుగా కక్షలు, కార్పణ్యాలకు కారణమైంది. చివరకు ప్రత్యర్థులు వెంటాడి వేటాడడంతో అన్నయ్య దారుణ హత్యకు గురవగా తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జలుమూరు మండలం పెద్దదూగాంలో సోమవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలు ఇవీ... అన్నదమ్ములైన ధర్మాన లచ్చుమయ్య(40), భాస్కరరావు ఉదయం 6.20 గంటలకు పొలం పనులకు బయలుదేరారు. గ్రామ శివార్లకు వచ్చేసరికి సందుల్లోంచి నాగలితో ఎడ్లు వెళ్లలేవని లచ్చుమయ్య మరో తోవలో పొలం వైపు వెళ్లాడు. భాస్కరావు ఇంకో తోవలో వెళుతుండగా ప్రత్యర్థులు ధర్మాన ముఖలిం గం, కుమారుడు వెంకటరమణ, భార్య తవిటమ్మ మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో భాస్కరరావు చేయి విరిగిపోగా పక్కటెముకలు తీవ్రం గా గాయాలు తగిలాయి. ఆయన కాపాడాలంటూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో ప్రత్యర్థులు పారిపోయారు. విషయం తెలిసిన లచ్చుమ య్య కుమారుడు భానుప్రసాద్ తన తండ్రికీ అపా యం ఉందని అడ్డతోవలో సైకిల్‌పై పొలం వైపు వెళ్లాడు. భాస్కరరావు తప్పించుకోవడంతో ప్రత్యర్థులు లచ్చుమయ్యను వెంటాడి వేటాడారు. కత్తి, బల్లెంతో తల, నడుము, వీపు, చేయిపై పలుసార్లు పొడిచారు. ఆ సమయంలో అక్కడకు చేరిన భానుప్రసాద్‌ను కూడా హతమార్చడానికి ప్రయత్నించగా ఆయన తప్పించుకుని గ్రామంలోకి వచ్చాడు. ఇం తలో చుట్టుపక్కల రైతులు, కూలీలు కేకలు వేయడం తో దుండగులు లచ్చుమయ్యను వదిలి వెళ్లిపోయారు. కొనూపిరితో ఉన్న లచ్చుమయ్యను ఇంటికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే ప్రాణం విడిచాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నపాటి వివాదమే... లచ్చుమయ్య, ముఖలింగంలు దగ్గర బంధువులే. అయితే పొలం గట్టు విషయంలో నాలుగేళ్లుగా గొడవపడుతుండేవారని గ్రామస్తులు తెలిపారు. తరచూ గట్టు కొట్టి పొలం కలుపుకోవడం, కళ్లాల వద్ద కొట్లాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ముఖలింగం ఆది నుంచి వివాదస్పదడని, రెండేళ్లు క్రితం ధర్మాన ఈశ్వరరావు అనే వ్యక్తిని కళ్లం తగాదాలో తలపగలు కొట్టాడని పేర్కొన్నారు. పోలీస్ పికెట్ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. లచ్చుమయ్య కుటంబానికి రక్షణ ఏర్పాటు చేసినట్లు నరసన్నపేట సీఐ అర్.వి.వి.ఎస్.ఎన్.చంద్రశేఖర్ తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్, డాడ్ స్క్వాడ్ గుండాలు చెరువు వద్ద కొలతలు, మృతుడు లచ్చుమయ్య రక్తపు మరకలు ఆనవాళ్లు తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు, క్లూస్ టీమ్ సీఐ కోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జలుమూరు ఎస్ఐ డి.విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు. -
పశ్చిమగోదావరిలో పాతకక్షలతో వ్యక్తి హత్య


