West Bengal: కబీర్‌కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు! | West Bengal Polls Humayun Kabir calls Owaisi elder brother | Sakshi
Sakshi News home page

West Bengal: కబీర్‌కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు!

Mar 25 2026 12:29 PM | Updated on Mar 25 2026 1:06 PM

West Bengal Polls Humayun Kabir calls Owaisi elder brother

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- 2026 సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నడవాలని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒవైసీని తన ‘పెద్దన్న’ (బడా భాయ్)గా అభివర్ణించిన హుమాయున్ కబీర్.. రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.

ఒవైసీ అడుగుజాడల్లోనే..
తమ కూటమి వివరాలను వెల్లడిస్తూ 182 నుండి 192 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు కబీర్ తెలిపారు. ‘నా పెద్దన్న అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ గడ్డపైకి వచ్చారు. ఏజేయూపీ, ఏఐఎంఐఎం కలిసి ఈ ఎన్నికల యుద్ధంలో తలపడతాయి. ఆయనను నా సొంత అన్నలా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనీసం 20 భారీ ర్యాలీల్లో నాతో కలిసి పాల్గొంటారు’ అని అన్నారు. ఏప్రిల్ 1న బెహ్రంపూర్‌లో లక్షలాది మందితో నిర్వహించే తొలి సభకు ఒవైసీ స్వయంగా హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.
 

ఎప్పటికీ విడిపోని బంధం
ఈ పొత్తు కేవలం 2026 ఎన్నికల కోసమే కాదని, రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం ఒవైసీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని కబీర్ ఉద్ఘాటించారు. ‘నా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దిశగా నడిపించినా తూచా తప్పకుండా పాటిస్తాను. ఈ కూటమి ఎప్పటికీ విడిపోదు’ అంటూ తన నిబద్ధతను చాటుకున్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర బెంగాల్, కోల్‌కతా తదితర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

ప్రతిపక్షాల ఫైర్
మరోవైపు ఈ పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒవైసీ, హుమాయున్ కబీర్ కలవడం వల్ల సెక్యులర్ ఓట్లు చీలిపోయి, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుతుందని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ఈ కూటమి వల్ల ముస్లిం ఓటర్లు ఏకాకి అవుతారని, అయితే జనం వీరిని నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలో ముస్లిం ఉప ముఖ్యమంత్రి వస్తారని కబీర్ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement