సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాతి లక్ష్యం జాతీయ రాజకీయాలేనని ప్రకటించారామె. అయితే అది అధికారం కోసం కాదని.. కేవలం బీజేపీ పతనం కోసమేనని వ్యాఖ్యానించారు.
కోల్‌కతాలో జరిగిన ఎన్నికల సభలో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ విజయం తర్వాతే ఢిల్లీకి వస్తా.. బీజేపీని తరిమి కొడతా అంటూ మాట్లాడారామె. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తోంది. నేను బెంగాల్‌లో పుట్టాను.. ఇక్కడే చస్తాను. కానీ, బెంగాల్‌లో గెలిచాక ఢిల్లీకి తప్పకుండా వెళ్తాను. నాకు కావాల్సింది అధికారం కాదు. బీజేపీ పతనం. ఢిల్లీలోనూ వాళ్లను ఇదే తరహాలో ఎదుర్కొంటాను. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడతానని’’ అని దీదీ వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఈసారి మరింత ఉత్కంఠభరితంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తుండగా.. బీజేపీ మాత్రం ఆమె ప్రభుత్వంపై అవినీతి, దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల స్పందన కూడా విశేషంగా ఉంది. గురువారం జరిగిన తొలి దఫా పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. సుమారు 92 శాతం టర్నౌట్ నమోదైంది. చివరిసారిగా 2011లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా.. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ దారుణ పరాజయం పాలైంది.
తాజా భారీ ఓటింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ‘‘మార్పు కోసం ప్రజల సంకల్పం’’గా అభివర్ణించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఇది తమ విజయానికే సంకేతామని మమతా బెనర్జీ అంటున్నారు. రెండో విడత పోలింగ్ 2026 ఏప్రిల్ 29న జరగనుంది. ఈ విడతలో మిగిలిన 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.


