హార్మూజ్‌ను దాటిన 2 భారతీయ నౌకలు  | Two LPG Ships Cross Hormuz Safely Amid Tensions, Indian Cargo Vessel Attacked Near Oman, More Details Inside | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ను దాటిన 2 భారతీయ నౌకలు 

May 15 2026 4:19 AM | Updated on May 15 2026 10:08 AM

Two India-bound LPG vessels cross Strait of Hormuz

హాజీ అలీ నౌకపై దాడి.. సముద్రంలో మునక 

న్యూఢిల్లీ: హార్మూజ్‌ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నా ఎల్పీజీ సరకుతో వస్తున్న రెండు సరకురవాణా నౌకలు విజయవంతంగా జలసంధిని దాటాయి. ‘సైమీ’ఎల్పీజీ ట్యాంకర్‌ మే 13వ తేదీన హార్మూజ్‌ను దాటగా ఎన్‌వీ సన్‌షైన్‌ అనే మరో ఎల్పీజీ నౌక గురువారం దాటింది. ఈ రెండు నౌకలతో కలిపి గత రెండు నెలల్లో హార్మూజ్‌ను దాటి భారతీయ నౌకల సంఖ్య 13కు పెరిగింది.

యూఏఈలోని రువాయిస్‌ రిఫైనరీ నుంచి బయల్దేరిన సైమీ నౌకలో దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇది మే 16వ తేదీకల్లా గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకునే ఆస్కారముంది. ఎన్‌వీ సన్‌షైన్‌ నౌకలో ఏకంగా 46,427 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మే 18వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకునే అవకాశముందని కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్‌ మంగళ్‌ తెలిపారు. ఈ రెండు నౌకలను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ భారత్‌కు రప్పిస్తోంది.  

ఆగని దాడుల పరంపర.. 
కొన్ని నౌకలు విజయవంతంగా హార్మూజ్‌ను దాటుతున్నా మరి కొన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి. గతంలో రెండు నౌకలపై దాడి జరగ్గా ఇప్పుడు మరో నౌకపై మెరుపుదాడి చేశారు. దీంతో సోమాలియా నుంచి షార్జాకు వెళ్తున్న భారతీయ జెండాతో ఉన్న సంప్రదాయక సరకు రవాణా నౌక ‘హాజీ అలీ’యాత్ర విషాదంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున ఒమన్‌ ప్రాదేశిక సముద్రజలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై దాడి జరిగింది.

 ‘‘57 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పున్న ఈ నౌక ప్రధాన భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈలోపు విషయం తెల్సుకుని ఒమన్‌ తీరగస్తీ దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని కాపాడాయి. నావికులందరినీ త్వరలోనే భారత్‌కు తరలిస్తాం. నౌకపై ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటూ వాణిజ్య నౌకలపై దాడి, నావికులకు ప్రాణహాని కల్గించే ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’’అని అదనపు కార్యదర్శి ముకేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement