
- మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- క్షమాపణలు చెప్పామంటే దానికో అర్థం ఉండాలి
- విచారణ నుంచి తప్పించుకోవడానికి మొసలి కన్నీరు కార్చొద్దు
- కల్నల్ ఖురేషిపై చేసిన వ్యాఖ్యలకు విచారణ ఎదుర్కోవాల్సిందే
- ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశం
- రేపటి ఉదయానికల్లా సిట్ ఏర్పాటు చేయాలి
- అందులో మహిళా అధికారి ఉండాలి
- దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు(సోమవారం, మే 19) విచారణలో భాగంగా విజయ్ షా చెప్పిన క్షమాపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.
‘క్షమాపణలు ఏమిటి..?, అవి ఏ రకమైన క్షమాపణలు. క్షమాపణలు చెబుతున్నామంటే దానికి ఎంతో కొంత అర్థం ఉండాలి. ఇది విచారణ నుంచి బయటపడటానికి కార్చే మొసలి కన్నీరా?, మీకు ఎలాంటి క్షమాపణ ఉంది?, మిమ్మల్ని కోర్టు క్షమాపణలు చెప్పమని అడిగిందా?, మరి ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?, మీరు ఆ మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు నిజాయితీగా క్షమాపణలు కోరిన సందర్భం ఏమైనా ఉందా?, మరి ఇక్కడ ఎందుకు మాకు క్షమాపణలు చెబుతున్నారు?’అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
అదే సమయంలో విజయ్ షాపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన స్సెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్ ను రేపటి(మంగళవారం) ఉదయానికల్లా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఒక మహిళా అధికారిని నియమించి మే 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.
అసలేమిటీ వివాదం?
మంత్రి విజయ్ షా గత మంగళవారం(మే 13వ తేదీ)ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు.
అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.