బెంగళూరు రేవ్‌ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు! | Telugu Film Actors And Celebrities Caught In Bengaluru Rave Party, Actors Gives Clarity | Sakshi
Sakshi News home page

Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!

Published Tue, May 21 2024 3:34 AM

Telugu film celebrities joins Bengaluru rave party

నగర శివార్లలోని ఫార్మ్‌హౌస్‌లో ‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట పార్టీ 

రేవ్‌ పార్టీని ధ్రువీకరించిన బెంగళూరు పోలీసులు 

హైదరాబాద్‌కు చెందిన వాసు నిర్వహించినట్లు అనుమానాలు 

తాము ఉన్నామనే వార్తలు ఖండించిన సినీనటులు శ్రీకాంత్, హేమ

సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్‌ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్‌ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్‌హౌస్‌లో ఈ రేవ్‌ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్‌ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్‌ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.  

వారికి వైద్య పరీక్షలు 
రేవ్‌పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.  బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్‌ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్‌ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.  పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్‌పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్‌స్కా్వడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట రేవ్‌ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.      

జీఆర్‌ ఫార్మ్‌హౌస్‌లో పార్టీ 
హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కాన్‌కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్‌ ఫార్మ్‌హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని  ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

రూ.50 లక్షల వరకు వ్యయం 
నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్‌ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్‌ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్‌ కమోడ్‌లలో వేసి ఫ్లష్‌ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్‌హౌస్‌ను క్షుణ్ణంగా గాలించారు.

ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్‌లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్‌హౌస్‌ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్‌ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్‌లో తీసింది కాదని, ఆ ఫార్మ్‌హౌస్‌ లోపలే హేమ వీడియో బైట్‌ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు.  

నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్‌ 
బెంగళూరు రేవ్‌ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్‌ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్‌ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్‌ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్‌ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.

అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం.  అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్‌ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్‌ పార్టీ లకు, పబ్స్‌కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్‌ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు.  దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్‌ విజ్ఞప్తి చేశారు.  

నేను హైదరాబాద్‌లోనే చిల్‌ అవుతున్నా..:  సినీ నటి హేమ  
బెంగళూరులో నన్ను అరెస్ట్‌ చేశారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. ఓ ఫామ్‌హౌస్‌లో చిల్‌ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement