కారులో నైట్రోజన్‌ వాయువు పీల్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

Techie inhales Nitrogen in car to kill himself in Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: కారులో నైట్రోజన్‌ వాయువును పీల్చి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యమే ఆయన ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళరురు మహాలక్ష్మి లేఅవుట్‌ కురుబరహళ్లి జంక్షన్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. టెక్కీ విజయ్‌కుమార్‌ (51) మహాలక్ష్మి లేఅవుట్‌లో ఉంటూ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనను దీర్ఘకాలంగా గుండెజబ్బు పీడిస్తోంది. దీంతో జీవితం మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు.

ఇందుకోసం నైట్రోజన్‌ సిలిండర్‌ కొనుగోలు చేసి తెల్లవారుజామునే సొంత కారులో బయటకు వచ్చాడు. కారు లోపల జరిగేది బయటకు కనిపించరాదని కారు పైన రగ్గును కప్పాడు. వాయువు లీక్‌ కాకూడదని కారు డోర్లకు ప్లాస్టిక్‌ కవర్‌ కప్పి ఉంచాడు. తరువాత డోర్లు వేసుకుని వెనుక సీట్లో కూర్చొని ఆ సిలిండర్‌ నుంచి వాయువును లీక్‌ చేసి పీల్చాడు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతూ పెనుగులాడడంతో కారు కదలసాగింది. అది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కారు తెరిచి చూడగా విజయ్‌కుమార్‌ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

అతడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కారు డోర్లను పోలీసులు మాత్రమే తెరవాలి, ఇందులో విషపూరితమైన వాయువు ఉంది అని రాసి ఉన్న ఒక నోట్‌, మరో డెత్‌ నోట్‌ లభ్యమయ్యాయి. తనకున్న అనారోగ్యంపై ఇంటర్‌నెట్‌లో శోధించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ జబ్బు వల్ల ఏమవుతుందోనని తరచూ ఆందోళన చెందుతూ ఇంట్లో వాళ్లతో కూడా చర్చించేవాడని తెలిసింది. ఆత్మహత్య మార్గాలనూ ఇంటర్నెట్‌లో గాలించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (షాకింగ్‌ వివరాలు.. దేశంలో క్యాన్సర్‌ విజృంభణ.. 2022లో 8 లక్షల మంది మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top